ఫాంట‌సీ థ్రిల్ల‌ర్‌లో నంద‌మూరి త్ర‌యం?

  • IndiaGlitz, [Wednesday,February 21 2018]

సీనియర్ నటుడు హరికృష్ణ మళ్ళీ నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ పరిశ్రమ వర్గాలు. సుమారు 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ హరికృష్ణ తెరపై కనిపించనున్నారు. అది కూడా త‌న త‌న‌యులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌తో కలిసి ఆయ‌న సందడి చేయబోతున్నారని స‌మాచారం.

దైవత్వం లాంటి మంచి, రాక్షసత్వం లాంటి దురాశ మధ్య సాగే ఫాంటసీ థ్రిల్లర్ లో ఈ నందమూరి తండ్రీ కొడుకులు నటించనున్నట్టు తెలిసింది. కాస్త వివరాల్లోకి వెళితే.. 'ప్రేమ ఇష్క్ కాదల్', 'సావిత్రి' సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు పవన్ సాదినేని.. తాజాగా కళ్యాణ్ రామ్‌కు ఓ ఫాంటసీ సబ్జెక్టును చెప్ప‌డం జ‌రిగిందట‌. అది న‌చ్చ‌డంతో.. క‌ళ్యాణ్ కూడా వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌.

అంతేగాకుండా, ఈ కథకి వాణిజ్యపరమైన అంశాలను జోడిస్తూ రూపొందించ‌మ‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది ఇందులో రెండు ర‌కాల పాత్ర‌ల‌ను కళ్యాణ్ రామ్ పోషించ‌నున్నార‌ట‌. మంచి వ్య‌క్తిత్వం ఉన్న పాత్ర ఒక‌టైతే.. దురాశ క‌లిగిన యోధుడి పాత్ర మ‌రొక‌ట‌ని తెలిసింది. తన దర్శకత్వంలో నందమూరి త్రయాన్ని నటింపజేయాలని.. ఎన్టీఆర్, హరికృష్ణ కోసం ప‌వ‌న్ కీలకపాత్రలు తయారు చేశార‌ట‌. మరి ఈ పాత్రలకి ఎన్టీఆర్, హరికృష్ణ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారో లేదో చూడాలి. వైవిధ్యమైన కథలను రచించే గుణ్ణం గంగరాజు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేయనున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.