Nakshatram Review
సందీప్ కిషన్, సాయిధరమ్‌తేజ్, ప్రగ్యా జైశ్వాల్, రెజీనా, ప్రకాష్‌రాజ్, బ్రహ్మాజీ, శివాజీరాజా.. ఇలా అందరూ పోలీస్ డ్రస్సుల్లో కనిపించేసరికి 'నక్షత్రం' సినిమా మీద అమాంతం అంచనాలు పెరిగాయి. దానికి తోడు కృష్ణవంశీ గతంలో 'ఖడ్గం' వంటి సినిమా తీసి ఉండటమే. దేశభక్తిని, పోలీస్ వ్యవస్థని సగౌరవంగా చూపించే దర్శకుడిగా క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ మీద మార్కు ఉండటమే. ఇప్పటిదాకా హీరోగా చేసిన యువ కథానాయకుడు తనీష్‌ని `నక్షత్రం`తో విలన్‌గా పరిచయం చేశారు కృష్ణవంశీ. ఇంతమంది స్టార్‌కాస్ట్ తో, కాస్త ఎక్కువ సమయం తీసుకుని కృష్ణవంశీ చేసిన ప్రయత్నం ఫలించిందా? ఆయన గాడీ మళ్లీ సక్సెస్‌బాటను పట్టిందా? వేసేయండి ఓ లుక్..
కథ:
మూడు తరాలుగా పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ఫ్యామిలీ రామారావు (సందీప్ కిషన్)ది. రామారావుకు ఎస్. ఐ కావాలన్నది కల. అతని మరదలు (రెజీనా) సినిమాల్లో జూనియర్ డ్యాన్సర్‌గా పనిచేస్తుంటుంది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. మరోవైపు అలెగ్జాండర్ (సాయిధరమ్‌తేజ్) పోలీస్ ఆఫీసర్. కిరణ్ (ప్రగ్యా జైశ్వాల్) కూడా ఐపీయస్ ఆఫీసర్. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అంతలో ఆపరేషన్ డేగ భారం వారి మీద పడుతుంది. ఉన్నట్టుండి అలెగ్జాండర్ కనిపించకుండా పోతాడు. దానికి కారణం ఏంటన్నది సస్పెన్స్. ఇంకోవైపు పోలీస్ కమిషనర్ రామబ్రహ్మం (ప్రకాశ్‌రాజ్) తనయుడు రాహుల్ (తనీష్)కి చెడు స్నేహాలుంటాయి. డ్రగ్స్ కు అలవాటు పడి ఉంటాడు. బాంబుల ముఠాతో సంబంధాలుంటాయి. అతనికి అలెగ్జాండర్‌కి, రామారావుకు సంబంధం ఏమిటన్నదే సినిమా.
హైలైట్స్:
సందీప్‌కిషన్‌కి, సాయిధరమ్‌తేజ్‌కి పోలీసుగా నటించిన అనుభవం ఇంతకు ముందే ఉంది. పోలీసు కావాలనుకునే అభ్యర్థిగా సందీప్, ఆల్రెడీ ప్రూవ్డ్ ఐపీయస్ ఆఫీసర్‌గా తేజ్ చక్కగా నటించారు. రకరకాల కాస్ట్యూమ్స్ లో రెజీనా గ్లామర్ రోల్ చేసింది. గ్లామరస్ నటిగానూ, దొంగగానూ, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గానూ, ఫైటర్‌గానూ, షూటర్‌గానూ ప్రగ్యా జైశ్వాల్ నటన ఆకట్టుకుంది. గాబరా పడే తల్లిగా తులసి, నేటి తరం నాడి పట్టకున్న పోలీసుగా రఘుబాబు, లౌక్యం తెలిసిన పోలీసుగా బ్రహ్మాజీ పాత్రల్లో ఒదిగిపోయారు. విలన్‌గా తనీష్‌కి ఇది కొత్త టర్న్. తను ఇలా చేయగలడని ఎవరూ ఊహించరు. బ్యాడీగా పర్ఫెక్ట్ గా చేశాడు. ప్రకాశ్‌రాజ్, జె.డి. చక్రవర్తి సహజంగా కనిపించారు. వైవాహర్ష యాజ్ యూజువల్‌గా నటించారు. ఏనుగుల బ్యాక్ డ్రాప్‌లో చిత్రించిన సందీప్ - రెజీనా పాట, బీచ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన సాయిధరమ్‌తేజ్ - ప్రగ్యా జైశ్వాల్ పాట, రెజీనా ఇంట్రడక్షన్ సాంగ్... యువతను ఏమాత్రం రెప్పవాలనివ్వవు. ఈస్తటిక్ గా ఉన్నాయి.
డ్రాబ్యాక్స్:
స్క్రిప్టు, స్క్రీన్‌ప్లే కొత్తగా అనిపించవు. రెజీనా పరిచయం, సినిమా సెటప్, హీరో చేసే పోలీస్ ప్రయత్నాలు, హీరో తల్లి పడే హడావిడి, మధ్యలో కొన్ని స్టేషన్ సీన్లు, దొంగగా ప్రగ్యా జైశ్వాల్.. దాదాపు తొలి సగం మొత్తం ఇదే. ఫస్టాఫ్‌లో ఏవో సన్నివేశాలు వచ్చి పోతున్నట్టు ఉంటాయి కానీ, ఎక్కడా నవ్వు పుట్టించవు. రెండో సగంలో సాయిధరమ్‌తేజ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాతే కథలో ఊపు మొదలవుతుంది. అలెగ్జాండర్ , కిరణ్‌రెడ్డిల స్పీడు, వారు చేసే యాక్టివిటీస్ వల్ల కాస్త స్పీడు పెరుగుతుంది. అలెగ్జాండర్ పాత్రను హైలైట్ చేసి తీశారు కానీ, గ్రాఫ్ మెయింటెయిన్ చేయలేకపోయారనిపిస్తుంది. పాటలను తీసిన తీరు బావుంది కానీ, ఏ పాటా పాడుకోదగ్గరీతిలో లేదు. వైవాహర్ష చేసిన సన్నివేశాలు ఇంతకుముందు `కింగ్`లో బ్రహ్మానందం చేసిన పాత్రను, రెజీనా పాత్ర `ఖడ్గం` సంగీతను, తనీశ్ పాత్ర `ఛత్రపతి` షఫీని గుర్తుకు తెస్తాయి.
విశ్లేషణ:
తన కొడుకు అంటే కమిషనర్ కే సదభిప్రాయం లేనప్పుడు, ఆయన కుమారుడికి మిగిలిన పోలీసులు అందరూ ఎందుకు భయపడుతుంటారో అర్థం కాదు. ఓ ఐపీయస్ స్థాయి అధికారి నిశ్చితార్థానికని బయలుదేరి రాకుండా పోయినప్పుడు కమిషనర్ కనీసం ఎందుకు కేసు నమోదు చేసి విచారించరో అర్థం కాదు. సిన్సియర్ ఐపీయస్ పోలీస్ కిరణ్ రెడ్డిని తొలి సగంలో దొంగగా చూపించాల్సిన అవసరం ఏంటో తెలియదు.. ఒకవైపు ప్రేమించే వాడు, అత్త కొడుకు పక్కనే ఉన్నప్పటికీ, రోజుకో డ్రస్సు వేసుకుంటూ అందరినీ నవ్వించే రెజీనా కష్టాల్లో ఉన్నానని ఎలా చెబుతుందో ఎవరికీ అర్థం కాదు. మానవబాంబు మార్కెట్లో పేలితే దాని గురించి చివర్లో ఎక్కడో క్లైమాక్స్ లో చెప్పే వరకు ఎవరికీ తెలియదు. కమిషనర్ మంచి వాడని తెలిసినప్పటికీ, ఆయన కొడుకు తనను ఆరు నెలలుగా హింసిస్తున్నాడని చెప్పడానికి పూనమ్ బజ్వాకు ఉన్న ప్రాబ్లమ్ ఏంటో అంతుబట్టదు. ఆలోచించాలేగానీ ఇలాంటివి సినిమాలో చాలా లోటుపాట్లు కనిపిస్తాయి. వాటి మీద ఇంకాస్త దృష్టి పెడితే బావుండేది. కృష్ణవంశీ మార్కు తెలుగుదనాన్ని, కొబ్బరి ఆకులను, పందిళ్లను, మల్లెపూలను ఆశించి సినిమాకు వెళ్తే మాత్రం నిరాశ తప్పదు
చివరాఖరుగా.. 'నక్షత్రం'.. కొత్త వెలుగులేం లేవు
Nakshatram Movie Review in English
- Read in English