లాక్‌డౌన్ సమయంలో సినిమా షూటింగ్స్ అన్నీ ఆగాయి. కానీ రామ్‌గోపాల్ వర్మ మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అసలు సినిమాలను ఎలా షూట్ చేస్తున్నాడనే సీక్రెట్ మాత్రం చెప్పడం లేదు. ఇక ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అనే మాధ్యమం ద్వారా తన సినిమాలను విడుదల చేసుకుంటూ వస్తున్నాడు. పేర్ ఫర్ వ్యూ పద్ధతిలో వసూళ్లను రాబట్టుకుంటున్నాడు. అయితే డిఫరెంట్ షినిమాలను తెరకెక్కించిన వర్మ పోర్న్ కంటెంట్ సినిమాలను తెరకెక్కించడం శోచనీయంగా మారింది. ఏదైతేనేం బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నాడో ఏమో కానీ ఇంతకు ముందు మియా మాల్కోవాతో క్లైమాక్స్ అనే చిత్రాన్ని తెరకెక్కించిన వర్మ ఇప్పుడు నగ్నం అనే మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. తాను ఎలాంటి సినిమా చేస్తున్నానో అనే విషయాన్ని వర్మ ఎక్కడా దాచి పెట్టడం లేదు. నగ్నం కోసం పే ఫర్ వ్యూ కోసం రూ.200లను ధరను ఖరారు చేశాడు. అసలు నగ్నంతో వర్మ ఏం చెప్పాలనుకున్నాడనే సంగతి తెలియాలంటే కథలోకి వెళ్లాలి...
కథ:
స్వీటీ(శ్రీరాపాక) భర్తతో కలిసి ఉంటుంది. ఆమె భర్త(దీపక్) భార్యను పెద్దగా పట్టించుకోడు. వీరి పనిమినిషి(జమాల్) ఓసారి స్వీటీని నగ్నంగా చూస్తాడు. ఆ విషయం స్వీటీ పసిగడుతుంది. జమాల్‌తో సంబంధం పెట్టుకుంటుంది. ఓరోజు స్వీటీ భర్త వీరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటాడు. ఆ గొడవలో జమాల్, స్వీటీ భర్తను చంపేస్తుంది. పోలీసులు వచ్చినప్పుడు స్వీటీ దొంగ ఏడుపు నటిస్తూ జమాల్‌ను కేసులో ఇరికిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? దీపక్ నిజంగానే చనిపోయాడా? స్వీటీని జమాల్ ఏమైనా చేశాడా? అనే విషయం తెలుసుకోవాలంటే మాత్రం రూ.200 కట్టి ఆర్టీవీ వరల్డ్ థియేటర్‌కు వెళ్లాల్సిందే.
విశ్లేషణ:
వర్మ గొప్ప టెక్నీషియన్ ఇది ఎవరూ కాదనలేని నిజం. అయితే ఆయన తీసే సినిమాల్లో కంటెంట్ ఎప్పుడో మిస్ అయ్యింది. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు చూస్తుంటే కంటెంట్ చెప్పాలని కాకుండా డబ్బులు సంపాదించుకోవాలనే వర్మ సినిమాలు తీస్తున్నట్లు అనిపిస్తుంది. బలహీనతలను సొమ్ము చేసుకునే దర్శకుల లిస్టుల వర్మ ఎప్పుడో చేరిపోయాడు. అదేమని అడిగితే నేను నా సినిమాలు చూడమని మీకేమైనా చెప్పానా? ఇష్టముంటే చూడండి అనే సమాధానం అటు నుండి వస్తుంది. అందుకనే పక్కవాడి బలహీనతను ఆసరాగా చేసుకునే రకం అని పైన చెప్పాల్సి వచ్చింది. అలాగే కొంత మందికి తప్పక భరించే తలనొప్పిలా మారాడు ఆర్జీవీ.
ఓ ఆక్రమ సంబంధం అనే పాయింట్‌ను తీసుకుని ఎక్కడెక్కడో కెమెరాలు పెట్టి షూట్ చేసి నగ్నం సినిమాను తెరకెక్కించాడు. ఏదో ఉందని మాత్రం ప్రేక్షకుడు చూడాలనుకుంటే రూ.200 మరచిపోయామనే అనుకోవాలి. ఓరకంగా ఇలాంటి సినిమా థియేటర్‌లో విడుదల కాకపోవడం కూడా మంచిదే. శివ, రంగీలా వంటి సినిమాలను తెరకెక్కించిన వర్మేనా ఇలాంటి సినిమాలు చేస్తుందనిపించింది. ఇలాంటి కంటెంట్ చూడాలనుకుంటే ప్రేక్షకుడు నగ్నంనే ఎందుకు చూడాలి? దానికి సంబంధించిన ప్రపంచాలు చాలానే ఉన్నాయిగా. ఇందులో నటీనటులు, సినిమా కోసం పనిచేసిన సాంకేతిక నిపుణులకు పెద్ద దణ్ణం. ఈ సినిమా వల్ల ఉపయోగమెవరికైనా ఉందా? అంటే ఒకటి స్వీటీ పాత్ర చేసిన శ్రీరాపాకకు ఇలాంటి పాత్రలు ఇతర సినిమాల్లో పోషించే అవకాశం రావచ్చు. ఇక రామ్‌గోపాల్ వర్మ... ఏదో చూపిస్తా..అన్నట్లు బిల్డప్ ఇచ్చి వ్యూ కి రెండు వందలు నొక్కేసి ఏమీ ఎరగనోడిలా డబ్బులు సంపాదించాడు. ఇలాంటి సినిమాలు చూస్తే ఇకపై ఆర్జీవీని బూతు వర్మ అని పిలుస్తారనడంలో సందేహమే లేదు.
బోటమ్ లైన్: నగ్నం.. జేబుకు చిల్లు ఖాయం
Comments