Naa Saami Ranga: అదరగొడుతున్న నాగార్జున.. 'నా సామిరంగ' మూడు రోజులు కలెక్షన్స్ ఎంతంటే..?

  • IndiaGlitz, [Wednesday,January 17 2024]

సంక్రాంతి పండుగకి కింగ్ నాగార్జున మరోసారి హిట్ కొట్టాడు. గతంలో సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు చిత్రంతో హిట్స్‌ కొట్టగా.. తాజాగా 'నా సామిరంగ' చిత్రంతోనూ అదే సెంటిమెంట్ రిపీట్ అయింది. జనవరి 14న విడుదలైన ఈ చిత్రంలో నాగార్జునతో పాటు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ వంటి హీరోలు కూడా నటించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. తొలి రోజే పాజిటివ్ టాక్‌ తెచ్చుకోగా.. అదే జోరును కొనసాగిస్తుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ సినిమా తొలి రోజు రూ.8.60కోట్ల గ్రాస్ కలెక్షన్స్.. రూ.4.33కోట్ల షేర్ రాబట్టింది. ఇక రెండో రోజు కూడా రూ.4.55 కోట్ల షేర్ సాధించింది. మూడో రోజు కూడా అదే రీతిలో వసూళ్లు వచ్చాయి. దీంతో మూడు రోజుల్లో కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ.12.46కోట్ల షేర్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.24.80కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరో రెండు రోజులు సంక్రాంతి సెలవులు ఉండటంతో పాటు వెంటనే వీకెండ్ కూడా రానుండడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రస్తుతం వస్తున్న వసూళ్లు చూస్తుంటే త్వరలోనే రూ.50కోట్లు చేరే అవకాశముంది. ఇప్పటికే సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో హనుమాన్ చిత్రం బ్రేక్ ఈవెన్ అయి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెడుతోంది. ఇప్పుడు నా సామిరంగ కూడా బ్రేక్ ఈవెన్ సాధించే జాబితాలోకి చేరింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కేవలం రూ.18.50కోట్లకు మాత్రమే జరిగింది. ఇప్పటికే రూ.12.80కోట్ల షేర్ రావడంతో.. ఈ వీకెండ్ ఎడింగ్ లోపు సినిమా లాభాల్లోకి రానుంది.

ఇక మహేష్‌ బాబు నటించిన 'గుంటూరుకారం' చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కడంతో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరికొన్ని రోజులు పట్టే అవకాశముంది. మంచి అంచనాలతో విడుదలైన వెంకటేశ్ 75వ చిత్రం 'సైంధవ్' మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మొత్తానికి చూసుకుంటే చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలో ఈ సంక్రాంతికి విన్నర్‌గా నిలిచాయి. పండుగకు విడుదలై నాలుగు చిత్రాల్లో 'హనుమాన్' మొదటి విన్నర్‌గా నిలిచింది.