Nagarjuna:ఏపీలో హీరో నాగార్జున మద్దతు ఆ పార్టీకేనా..? ఆ వార్తల్లో నిజమెంత..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల వాతావరణం పీక్ స్టేజ్‌కి చేరుకుంది. పోలింగ్‌కు వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. పలువురు సెలబ్రెటీలు కూడా ఈసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తమకు ఇష్టమైన పార్టీకి మద్దుతగా ప్రచారం చేస్తూ గెలిపించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున పేరు తెరపైకి వచ్చింది. ఆయన ఫలానా పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ మోహన్ రెడ్డికి నాగార్జున తన మద్దతు ప్రకటించినట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. "సినిమా వాళ్ళం హైదరాబాద్‌లో ఉంటూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గురించి మాట్లాడడం సరి కాదు. నన్ను టీడీపీ తరపున మాట్లాడమని ఒత్తిడి తీసుకొచ్చారు. అక్కడ జగన్ గవర్నమెంట్ బాగానే ఉంది. అందుకే ఇండస్ట్రీ నుంచి ఎవరు ముందుకు వచ్చి మాట్లాడడం లేదు" అని నాగ్ తెలిపినట్లు ఓ పోస్టర్ వైరల్ అవుతోంది.
అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు నాగార్జున మద్దతు తెలిపినట్లుగా మరో వార్త తాజాగా తెరపైకి వచ్చింది. "ఈసారి సినిమా వాళ్లు అంతా పవన్ కళ్యాణ్‌కు అండగా నిలబడుదాం. లగ్జరీ జీవితం వదిలేసి ప్రజలకోసం పోరాడుతున్నాడు. వైఎస్ జగన్ సినిమా వాళ్లకు చేసిన ద్రోహం ఏ ఒక్క సినీ కార్మికుడు కూడా మరిచిపోడు. కూటమికి ఓటు వేసి గెలిపించండి" అని అన్నట్లుగా ఉంది. దీంతో నాగార్జున నుంచి పరస్పరం విరుద్ధమైన రెండు స్టేట్మెంట్లు రావడం అభిమానులతో పాటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ నేపథ్యంలో నాగ్ డిజిటల్ టీమ్ నుంచి ఈ వార్తలపై క్లారిటీ వచ్చింది. ప్రస్తుత రాజకీయాలపై నాగార్జున ఎలాంటి ప్రకటన చేయలేదని.. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. దయచేసి ఇలాంటి ఫేక్ వార్తలను వైరల్ చేయవద్దని కోరుతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల పేర్లతో కూడా ఇలాంటి ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. కొందరు కావాలనే స్టార్ హీరోల ఫోటోలతో ఎడిటింగ్ పోస్టులు వైరల్ చేస్తున్నారని తెలుస్తోంది. కాగా నాగార్జున.. వైసీపీ తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని ఇటీవల విపరీతమైన టాక్ నడిచింది. దీనిపై నాగ్ స్పందిస్తూ ఎన్నికలొచ్చిన ప్రతీసారి తాను పోటీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, తాను ఎక్కడా పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout