సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం
- IndiaGlitz, [Sunday,May 02 2021]
నాగార్జున సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సీనియర్ నేత జానారెడ్డి విజయం ఖాయమని ఇప్పటి వరకూ అంచనాలు కొనసాగాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కొనసాగిస్తూనే ఉంది. 10, 11, 14 రౌండ్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తానికి జానారెడ్డిపై నోముల భగత్ 18,449 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
Also Read: సీఎం కేసీఆర్‌కు మంత్రి ఈటల శాఖ బదిలీ
ఇక కాంగ్రెస్‌కు 59,239 ఓట్లు, బీజేపీకి 6,365 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి రెండో స్థానంలో నిలువగా, బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ.. తనను ఆశీర్వదించిన సాగర్ ప్రజానీకానికి పాదాభివందనం చేస్తున్నట్టు తెలిపారు. తన గెలుపునకు కృషి చేసిన టీఆర్ఎస్ శ్రేణులకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తానని భగత్ వెల్లడించారు. అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ విజయం కేసీఆర్‌కు అంకితమిస్తున్నట్టు వెల్లడించారు. వచ్చే ఎన్నికల నాటికి పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తానని నోముల భగత్ స్పష్టం చేశారు.