Revanth Reddy: కుట్రతోనే నాగార్జునసాగర్ ఘటన.. కేసీఆర్ పన్నాగాలు ఫలించవు: రేవంత్
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జునసాగర్ వద్ద ఏర్పడిన ఉద్రిక్తత ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ సాగర్ ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్తతలు కేసీఆర్ కుట్ర అని ఆరోపించారు. ఇలాంటి కుట్రలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు.
‘‘పోలింగ్ రోజు ఇలాంటి ఘటనలకు తెరలేపారు. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఏం ఆశించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తొమ్మిదిన్నర ఏళ్లుగా కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరించకపోవడంవల్లే ఇలాంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటికి శాశ్వత పరిష్కారం ప్రజామోదయోగ్యమైన ప్రభుత్వం ఏర్పడటమే. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తాం. దేశాల మధ్య నీటి వాటాలు పంచుకుంటున్నాం.. అలాంటిది రాష్ట్రాల మధ్య వాటాలు పంచుకోలేమా..? నీటి వాటాలు, ఆస్తుల పంపకాల విషయంలో కాంగ్రెస్ సమయస్ఫూర్తితో, సమన్వయంతో వ్యవహరిస్తుంది. అవసరమైనప్పుడు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారు. రాజకీయ లబ్ది కోసం చేస్తున్న కేసీఆర్ పన్నాగాలు ఫలించవు. కేసీఆర్‌వి దింపుడు కల్లం ఆశలే.. ఇలాంటి కుట్రలు ఎన్నికలపై ప్రభావం చూపాల్సిన అవసరం లేదు. వివాదాలను సామరస్యంగా సరైన పరిష్కారం చూపించే బాధ్యత మాది’’ అని రేవంత్ రెడ్డి మాట్లాడారు.
బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు భారీగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్దకు వచ్చి నీటి విడుదలకు ప్రయత్నించారు. ప్రాజెక్టు 26 గేట్లలో సగ భాగం.. అంటే 13వ గేట్ వరకు ప్రాజెక్టు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసులు వాదిస్తున్నారు. సాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్దమవ్వగా.. అప్రమత్తమైన తెలంగాణ అధికారులు మోటార్లకు కరెంట్ సరఫరా నిలిపివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదంతా కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా అని.. ఓడిపోతున్నారనే తెలిసే తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నారని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇన్ని రోజులు లేని హడావిడి పోలింగ్ రోజే ఎందుకు అవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని అధికారంలోకి వస్తుందని కోమటిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు నాగార్జునసాగర్ ఘటనపై తెలంగాణ ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ స్పందించారు. రాజకీయ నేతలు ఎవరూ ఆ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశాలు జారీచేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments