‘వైల్డ్ డాగ్’ షూటింగ్‌ స్టార్ట్ చేసిన నాగార్జున..

  • IndiaGlitz, [Thursday,September 03 2020]

కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన షూటింగ్‌లన్నీ తాజాగా ఒక్కొక్కటిగా ప్రారంభమవుతూ వస్తున్నాయి. ఈ విషయంలో బుల్లితెర ఎప్పుడో ముందడుగు వేసినప్పటికీ వెండితెర మాత్రం వెనుకబడే ఉంది. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినప్పటికీ స్టార్ హీరోలు మాత్రం షూటింగ్‌కి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో పెద్ద హీరోల సినిమాల షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

ఇలాంటి సమయంలో కింగ్ నాగార్జు మాత్రం డేరింగ్‌గా ముందుకు వెళుతున్నారు. ఓ వైపు ‘బిగ్‌బాస్’ షో కోసం ప్రోమోలు చేస్తూ.. సెప్టెంబర్ 6న ఆ షో ప్రారంభోత్సవ కార్యక్రమానికి రెడీ అవుతున్నారు. మరోవైపు ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్‌నూ ప్రారంభించారు. అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ షూటింగ్‌కు సిద్ధమైపోయారు. దానికి సంబంధించిన పిక్స్, వీడియోలను చిత్రబృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

కాగా.. వైల్డ్ డాగ్‌లో విజ‌య్ వ‌ర్మ అనే ఎన్ఐఏ ఆఫీస‌ర్ రోల్‌ను నాగార్జున చేస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ ద్వారా 'వైల్డ్ డాగ్' బృందంలో స‌భ్యులైన అలీ రెజా (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), ఆర్యా పండిట్ (స్పెష‌ల్ ఏజెంట్ - రా), కాలెబ్ మాథ్యూస్ (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), రుద్రా గౌడ్ (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), హ‌ష్వంత్ మ‌నోహ‌ర్ (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ) కూడా ప్రేక్షకులకు చిత్రబృందం పరిచయం చేసింది.

నేర‌స్తుల‌తో వ్య‌వ‌హ‌రించే అత్యంత క‌ఠిన‌మైన తీరుతో ఏసీపీ విజ‌య్ వ‌ర్మ‌ను 'వైల్డ్ డాగ్' అని పిలుస్తుంటారు. వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా అల్లిన క‌థ‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని ఒక భిన్న‌మైన పాత్ర‌ను నాగార్జున చేస్తున్నారు. దియా మీర్జా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీలో స‌యామీ ఖేర్ ఒక కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కిర‌ణ్ కుమార్ సంభాష‌ణ‌లు రాస్తుండ‌గా, షానీల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.