ప్రేమమ్ సినిమా తీయడానికి గట్స్ కావాలి.. చైతన్య అద్భుతంగా నటించాడు - నాగార్జున
- IndiaGlitz, [Wednesday,October 19 2016]
అక్కినేని నాగచైతన్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ప్రేమమ్. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్నినిర్మించారు. దసరా కానుకగా రిలీజైన ప్రేమమ్ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. 10 రోజుల్లో 21 కోట్లు షేర్ సాధించింది.
ఈ సందర్భంగా దసపల్లా హోటల్ లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.... ప్రేమమ్ సక్సెస్ సాధించడం చాలా హ్యాపీగా ఉంది. ప్రేమమ్ సినిమా చూసిన వెంటనే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనే నమ్మకం ఏర్పడింది. వెంటనే డైరెక్టర్ చందుకి కంగ్రాట్స్ చెప్పాను. అలాగే ప్రేమమ్ చూసిన వెంటనే చాలా హ్యాపీగా ఇంటికి వెళుతున్నాను అని ట్వీట్ చేసాను. అలా ట్వీట్ చేసిన వెంటనే...కొంత మంది ప్రేమమ్ చూసి హ్యాపీగా ఇంటికి వెళుతున్నారా..? లేక ఇంటికి వెళుతున్నందుకు హ్యాపీగా ఉన్నారా అని అడిగారు. ప్రేమమ్ చూడడం వలనే హ్యాపీగా ఇంటికి వెళుతున్నాను అని చెప్పాను. ప్రేమమ్ క్లైమాక్స్ లో శృతిహాసన్ స్వీటు తిని చైతన్య చూసినప్పుడు నా కళ్లంట నీళ్లు వచ్చాయి. వెరీ వెరీ గుడ్ ఫీలింగ్ అది.
ఇలాంటి రీమేక్ చేయడానికి గట్స్ కావాలి. చందు మన నేటివిటికి తగ్గట్టు చాలా బాగా తీసాడు. చాలా మంది చైతన్యతోనో, అఖిల్ తోనే శివ సినిమా తీయచ్చు కదా అని అంటుంటారు. మళ్లీ అలాంటి సినిమాను తీయలేం. చంద్రముఖి సినిమాను ఓరిజనల్ లో ఉన్నట్టే తీస్తే ఆడదు. మన కామెడీ, మన సాంగ్స్, మన కల్చర్ వేరు. ఆ కథలోని సోల్ తీసుకుని చందు మన నేటివిటికి తగ్గట్టు అద్భుతంగా తీసాడు. ప్రేమమ్ సినిమా రీమేక్ చేస్తున్నాం అనగానే తమిళనాడు, మలయాళం ఆడియోన్స్ కామెంట్ చేసారు. మన క్లాసిక్ మూవీని వాళ్లు రీమేక్ చేసినా మనం అలాగే కామెంట్స్ చేస్తాం. అయితే...మలయాళం ప్రేమమ్ కంటే గొప్పగా తీద్దాం అని కాదు తెలుగు ఆడియోన్స్ కు ఫీల్ గుడ్ లవ్ స్టోరీని అందిద్దాం అనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా తీస్తున్నాం అని చైతన్య చెప్పాడు.
ఇక చైతన్య గురించి చెప్పాలంటే....నేను బాగా నటిస్తే... కొడుకు కదా అని నాన్న నన్ను పొగిడేవారు కాదు..! కానీ..నేను నా కొడుకును పొగుడుతున్నాను. చైతన్య అద్భుతంగా నటించాడు. నాకు ఈ వయసులోనే గీతాంజలి సినిమా వచ్చింది. ఆ వయసులో నేను ఏం చేయగలనో అది చేసాను. చైతన్య కూడా అలాగే చేసాడు అనుకుంటున్నాను. ఈ సినిమాను టీవీలో ఎన్నిసార్లు వేసినా చూస్తేనే ఉంటారు. డైరెక్టర్ చందు నా ఫ్యాన్ కదా...! అందుకనే అనుకుంట డైలాగ్స్ బాగా రాసాడు. సైకిల్ చైన్ డైలాగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిర్మాతలు ఏమాత్రం రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా చివరిలో డైలాగ్ ఉంటుంది కదా...కొడుకు సంతోషం కన్నా తండ్రికి ఏం కావాలి అని..! ఇప్పుడు అదే చెబుతున్నాను చైతన్య సక్సెస్ రావడం కన్నా నాకు ఇంకేం కావాలి. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులు అందరికీ థ్యాంక్స్ అన్నారు.
అక్కినేని నాగ చైతన్య మాట్లాడుతూ...ప్రేమమ్ రీమేక్ గురించి నాకు ఫస్ట్ ప్రొడ్యూసర్ వంశీ చెప్పాడు. ప్రేమమ్ చూసిన వెంటనే నాకు బాగా నచ్చింది అందుకనే వెంటనే ఓకే చెప్పేసాను. సినిమా రిలీజ్ డేట్ గురించి టెన్షన్ పడకుండా సినిమా బాగా వచ్చింది అని అందరికీ నమ్మకం కుదిరినప్పుడే ఈ సినిమాని రిలీజ్ చేద్దాం అని నిర్మాత చాలా కేర్ తీసుకున్నారు. రీమేక్ చేయడానికి గట్స్ కావాలి. ఓరిజనల్ మూవీలోని సోల్ తీసుకుని చందు చాలా బాగా రీక్రియేట్ చేసాడు. చందు నా కెరీర్ కి బిగ్ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రవీణ్, శ్రీనివాసరెడ్డి, బ్రహ్మాజీ, నర్రా క్యారెక్టర్స్ వలన ఎంటర్ టైన్మెంట్ బాగా పండింది. ఈ సినిమా ఇంతటి సక్సెస్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.
చిత్ర సమర్పకుడు పి.డి.ప్రసాద్ మాట్లాడుతూ...రీమేక్ చేయడం అంటే సాహసం. మా డైరెక్టర్ చందు ఈ చిత్రాన్ని మన నేటివిటికి తగ్గట్టు చాలా బాగా తీసాడు. ప్రేమమ్ పది రోజుల్లో 21 కోట్లు షేర్ సాధించింది. మూడవ వారంలో కూడా ఇంకా థియేటర్స్ యాడ్ చేస్తున్నాం. కేరళలో కూడా మన ప్రేమమ్ చిత్రాన్ని రిలీజ్ చేసాం. అక్కడ మూడు షోలు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుండడం విశేషం. చెన్నైలో మూడవ వారంలో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈవారంలో చెన్నైలో మరో 6 స్ర్కీన్స్ పెంచుతున్నాం. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అక్కినేని అభిమానులకు థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
డైరెక్టర్ చందు మాట్లాడుతూ....ఈ మూవీకి ఇంతటి విజయం అందించిన ప్రేక్షకులకు అందరికీ థ్యాంక్స్. ఈ చిత్రంలో చైతన్య టీనేజ్ లుక్ చూసి....ఐదు సంవత్సరాల క్రితం షూట్ చేసి ఇప్పుడు యాడ్ చేసారా అని అడుగుతున్నారు. దీనిని బట్టి చైతు ఎంత కష్టపడ్డాడో అర్ధం చేసుకోవచ్చు. ఇది బెస్ట్ కాంప్లిమెంట్ గా ఫీలవుతున్నాను. ఈ చిత్రంలో నటించిన నాగార్జున గార్కి, వెంకటేష్ గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.