Nagarjuna: మహేశ్‌తో మల్టీస్టారర్ మూవీపై నాగార్జున ఏమన్నారంటే..?
- IndiaGlitz, [Saturday,January 13 2024]
ఈసారి సంక్రాంతి రేసులో కింగ్ నాగార్జున కూడా నిలిచిన సంగతి తెలిసిందే. 'నా సామిరంగ' మూవీతో భోగి రోజు ప్రేక్షకులను పలకరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించగా.. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. దీంతో ప్రమోషన్స్‌లో మూవీ యూనిట్ బిజీగా ఉంది. తాజాగా నాగార్జున తన సినిమాల గురించి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
సినిమా కథ ఇదే..
ఈ సినిమా కథ భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో జరుగుతుందని.. అందుకే సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మలయాళ మూవీకి రిమేక్ అయినా సోల్ మిస్ అవ్వకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టు మూవీని తెరకెక్కించామన్నారు. ఇక మూవీ షూటింగ్‌కు 72 రోజుల సమయం పట్టిందని.. ప్రీ ప్రొడక్షన్ పనులు 5 నెలలు చేశామని.. తన పార్ట్ 60 రోజుల్లో పూర్తి చేశారన్నారు. గతంలో 30 రోజుల్లోనే తన సినిమాలు కొన్ని తీశామన్నారు. అయితే సినిమాను త్వరగా పూర్తి చేయాలనుకుంటే తప్పులు ఎక్కువవుతాయని చెప్పారు. ఈ మూవీలో అలాంటి తప్పులు జరగకుండా ప్రీ ప్రొడక్షన్ పనులు ఎక్కువ రోజులు చేశామన్నారు.
ఈ టైటిల్ అందుకే పెట్టాం..
ఈ సినిమాలో చాలా టిపికల్ లవ్ స్టొరీ ఉందన్నారు. హీరోయిన్‌కు, తనకు మధ్య 12 ఏళ్ల నుంచి ఓ ప్రేమకథ నడుస్తుందని.. మళ్లీ 30 ఏళ్లు వచ్చే సరికి పరిచయం ఏర్పడి ప్రేమించుకుంటామని పేర్కొన్నారు. హీరోయిన్ అషికా రంగనాథ్ చాలా బాగా నటించిందని ప్రశంసించారు. 'నా సామిరంగ' టైటిల్ ఈ కథకు కచ్చితంగా సరిపోతుందని.. ఈ సినిమాలో తన ఊతపదం ఇదన్నారు. ఇక మూవీ రన్‌టైమ్ 2 గంటల 20 నిమిషాలు ఉంటుందన్నారు. మొత్తం 2 గంటల 35 నిమిషాలు షూట్ చేశామని.. కానీ 15 నిమిషాలు సీన్స్ కట్ చేశామని నాగ్ తెలిపారు.
ఆ పాత్రకు అల్లరి నరేశ్ కరెక్ట్..
ఇక మూవీలో అల్లరి నరేశ్‌ని అందరం కలిసి ఎంపిక చేశామని.. ఆ పాత్రకు నరేశ్ కరెక్ట్‌గా సరిపోతారని చెప్పుకొచ్చారు. తనతో పాటు రాజ్ తరుణ్‌ది కూడా కథలో కీలకమైన పాత్ర అని చెప్పారు. తన సినిమాలు అన్నింటిలో పోలిస్తే ‘నా సామిరంగ’ చాలా మాస్ ఎంటర్‌టైనర్ అని వివరించారు. తదుపరి సినిమాల గురించి చెబుతూ ప్రస్తుతం తమిళ దర్శకుడు నవీన్‌తో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నానని.. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంతో ఓ మూవీ ఉంటుందని తెలిపారు. ఇక మహేశ్‌బాబుతో మల్టీస్టారర్ చేయాలనుకున్నా.. కానీ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నారు.. అది పూర్తి కాగానే మల్టీస్టారర్ గురించి ఆలోచిస్తానని సమాధానమిచ్చారు. మొత్తానికి ఈ సంక్రాంతికి 'నా సామిరంగ' మూవీ కుటుంబ ప్రేక్షకులను అలరిస్తుందని నాగ్ ధీమా వ్యక్తం చేశారు.