Naganna Survey: మరోసారి వైసీపీదే అధికారం.. నాగన్న సర్వేలో కీలక విషయాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అనేక సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. అభ్యర్థుల జాబితా, ప్రచార కార్యక్రమాలకు లభిస్తోన్న జనాదరణ, ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల అన్ని పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే చాలా సంస్థలు చేసిన సర్వేల్లో అధికార వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చిచెబుతున్నాయి. తాజాగా మరో సర్వేలోనూ వైసీపీ ప్రభంజనం కొనసాగనుందని తేలింది. ప్రముఖ సంస్థ నాగన్న సర్వే తన ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వే కోసం ఒక్కో నియోజకవర్గంలో 600 మంది చొప్పున 157 స్థానాల్లో 1,05,000 మంది అభిప్రాయాలను సేకరించారు. మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు సర్వే కొనసాగినట్లు తెలిపారు. దీని ప్రకారం 175 అసెంబ్లీ సీట్లకు గాను అధికార వైఎస్ఆర్సీపీ 103 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయఢంకా మోగించడం ఖాయమని సర్వేలో వెల్లడైంది.
ఇక తెలుగుదేశం కూటమికి 39 స్థానాలు మాత్రమే దక్కనుండగా.. మిగిలిన 33 స్థానాల్లోనూ వైసీపీ-టీడీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. ఇందులో కూడా 20 నుంచి 25 సీట్లు వైసీపీ ఖాతాలో పడతాయని స్పష్టంచేసింది. అలాగే పార్లమెంట్ నియోజకవర్గాల విషయానికి వస్తే 20 నుంచి 21 స్థానాల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేస్తుందని తెలిపింది. ఎంపీ సీట్లలోనూ టీడీపీ కూటమికి ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చని పేర్కొంది. కేవలం 4 నుంచి 5 స్థానాల్లో మాత్రమే కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్లు నాగన్న సర్వే అంచనా వేసింది.
ఉమ్మడి జిల్లాల వారీగా అసెంబ్లీ స్థానాల్లో పార్టీల విజయావకాశాలు పరిశీలిస్తే.. శ్రీకాకుళం- వైసీపీ 7, టీడీపీ 2, (హోరాహోరీ 2), విజయనగరం- వైసీపీ 7, టీడీపీ 1, (హోరాహోరీ 1), విశాఖ- వైసీపీ 5, టీడీపీ 6, (హోరాహోరీ 4), తూర్పు గోదావరి- వైసీపీ 6, టీడీపీ 8, (హోరాహోరీ 5), పశ్చిమ గోదావరి- వైసీపీ 6, టీడీపీ 5, (హోరాహోరీ 4), కృష్ణా- వైసీపీ 6, టీడీపీ 6, హోరాహోరీ 4, గుంటూరు- వైసీపీ 8, టీడీపీ 4, (హోరాహోరీ 5) స్థానాలను గెలుచుకుంటాయి. అలాగే ప్రకాశం- వైసీపీ 8, టీడీపీ 2, (హోరాహోరీ 2), నెల్లూరు- వైసీపీ 9, టీడీపీ 0, (హోరాహోరీ 1), కడప- వైసీపీ 10, టీడీపీ 0, కర్నూలు- వైసీపీ 13, టీడీపీ 0, (హోరాహోరీ 1), అనంతపురం- వైసీపీ 9, టీడీపీ 3, (హోరాహోరీ 2), చిత్తూరు- వైసీపీ 10, టీడీపీ 2, (హోరాహోరీ 2) సీట్లు కైవసం చేసుకుంటాయని స్పష్టంచేసింది. మొత్తంగా ఏ సర్వే చూసినా వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments