Janasena party : జనానికి పనిచేయండి... ఓట్లు వేయించండి : జనసైనికులకు నాగబాబు దిశానిర్దేశం
- IndiaGlitz, [Wednesday,June 15 2022]
వీర మహిళలు, జనసైనికులు, నాయకులు సాధ్యమైనంత వరకూ ప్రజల్లో ఉండాలని సూచించారు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, సినీనటుడు నాగబాబు. బుధవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో ఆయన మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి అవి పరిష్కారం అయ్యేలా పని చెయ్యాలని సూచించారు. జనసైనికులుగా మనమంతా పార్టీ బలోపేతం కోసం, పార్టీ గెలుపు కోసం పని చేయాలని నాగబాబు అన్నారు. మన లక్ష్య సాధన దిశ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెదరనివ్వకూడదని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నో అటుపోట్లతో ఇక్కడి దాకా వచ్చాం:
చాలా ఇబ్బందులను, అన్ని అవరోధాలను దాటుకొని మనం ఈ స్థితికి వచ్చామని నాగబాబు గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఇబ్బందులు ఎదురైనా అలసిపోని గుండె ధైర్యంతో పని చెయ్యాల్సిన బాధ్యత మనకుందని ఆయన పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావజాలం మన ఆయుధమని, జనసేన గెలుపు కోసం రానున్న ఎన్నికల సంగ్రామంపై దృష్టి పెట్టాలని నాగబాబు దిశానిర్దేశం చేశారు. పొత్తులు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, కమిటీల నియామకం గురించి పవన్ కల్యాణ్ చూసుకుంటారని ఆయన తెలిపారు. పి.ఏ.సీ. సభ్యులు, పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులతో, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలతో చర్చించి మనందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని నాగబాబు చెప్పారు.
పనిచేయండి.. ఓటు రూపంలో ఫలితం తీసుకురండి:
ప్రతీ నియోజకవర్గంలో, ప్రతీ పోలింగ్ కేంద్రాల్లో, ప్రతీ బ్యాలెట్ బాక్సులో జనసేనకు ఓటు వేయించాల్సిన బాధ్యతను జనసైనికులు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం పని చేసి తద్వారా వారి అభినందనలను ఓటు రూపంలో బ్యాలెట్ బాక్సులో వేయించుకోగలగాలని నాగబాబు అన్నారు. జనసేన పార్టీకి రాజ్యాధికారం కట్టబెట్టాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని, పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయితే పరిపాలనలో చోటు చేసుకునే విప్లవాత్మకమైన మార్పులను ప్రతీ పౌరుడికి తెలియజేయాలని నాగబాబు దిశానిర్దేశం చేశారు.