Janasena : భావి తరాలను కాపాడుకోవాలంటే జనసేన రావాల్సిందే .. నేనూ కార్యకర్తలా శ్రమిస్తా: నాగబాబు

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేనను పటిష్ట పరిచే పనుల్లో బిజీగా వుంటున్నారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు. శనివారం జనసేన ప్రధాన కార్యాలయంలో ఏపీకి చెందిన పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. అవినీతిపరులు, దోపిడీదారుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి, భావి తరాలను కాపాడుకోవటానికి జనసేనను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అన్ని రకాలుగా వైసీపీ ప్రభుత్వం వైఫల్యం:

ఆంధ్రప్రదేశ్‌లో అమూల్యమైన వనరులు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో, ప్రజా ఆమోద పరిపాలన అందించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని నాగబాబు ఎద్దేవా చేశారు. దోపిడీకి గురవుతున్న రాష్ట్ర ఆర్థిక వనరులు, ప్రకృతి సంపదను కాపాడే సమర్థత జనసేనకు మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి జనసేన దగ్గర వినూత్నమైన ప్రణాళికలు ఉన్నాయని, పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయితే అవినీతి అనే పదమే వినపడకుండా పరిపాలన అందిస్తారని నాగబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే వరకూ తానూ ఒక కార్యకర్తగా పని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా గ్రామీణ స్థాయిలో విస్తరించి పని చేయ్యాల్సిన ఆవశ్యకతను నాగబాబు వివరించారు. కార్యకర్తలంతా సమష్టిగా పని చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

నాలుగు రోజులుగా పవన్ సమీక్షా సమావేశాలు:

అటు తెలుగు రాష్ట్రాలకు చెందిన జనసేన నేతలతో వరుస సమావేశాలతో తలమునకలై ఉన్నారు వున్నారు పార్టీ అధినేత పవన్ కల్యాణ్. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గత నాలుగు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇరు రాష్ట్రాలకు చెందిన పార్టీ నాయకులూ, వివిధ విభాగాల్లో ఉన్న యువ నాయకులూ, వీర మహిళలు, కార్యకర్తలతో ముఖాముఖి చర్చించారు.