Nagababu:టీడీపీ, జనసేన లక్ష్యం ఒక్కటే.. ఎన్నికలకు కలిసే, త్వరలో బీజేపీ కూడా : నాగబాబు కీలక వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ, జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు. ఆదివారం తిరుపతిలో పూతలపట్టు, పుంగనూరు, చిత్తూరు, పీలేరు, కుప్పం, తంబళ్లపల్లి నియోజకవర్గాలకు చెందిన నేతలు, క్రియాశీలక కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రజల శ్రేయస్సే ముఖ్యమని భావిస్తారని తెలిపారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన లక్ష్యమని.. టీడీపీది కూడా అదే ధోరణి కావడంతోనే ఎన్నికలకు కలిసి వెళ్లాలని పవన్ నిర్ణయించారని నాగబాబు పేర్కొన్నారు. ఈ కూటమిలో ముఖ్యమంత్రి ఎవరు అనేది కాలమే నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి అనే దానికంటే ముందు ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఇరు పార్టీలు పనిచేస్తాయని నాగబాబు వెల్లడించారు.
మాకు చంద్రబాబు అండగా నిలిచారు.. అందుకే పవన్ కూడా :
చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం బాధ కలిగించిందని, రాజకీయ కక్ష సాధింపులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని నాగబాబు హితవు పలికారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ పొత్తుపై నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. తమ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని జనసైనికులు, వీర మహిళలు స్వాగతిస్తున్నారని నాగబాబు చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్తామని, అలాగే బీజేపీతోనూ పొత్తుపై త్వరలో స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు. గతేడాది విశాఖలో పవన్ కళ్యాణ్‌ను అక్రమంగా నిర్బంధించినప్పుడు చంద్రబాబు సంఘీభావం ప్రకటించారని.. ప్రస్తుతం ఆయనకు అలాంటి పరిస్ధితులు రావడంతో అండగా నిలబడటం మన బాధ్యత అని నాగబాబు శ్రేణులకు వివరించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ అరాచకం:
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకుల అరాచకాలు, అన్యాయాలు, అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని నాగబాబు ఆరోపించారు. అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని.. వీటికి జనసేన నేతలు, జనసైనికులు భయపడరని ఆయన వెల్లడించారు. ప్రజలకు సేవ చేసే ఆలోచన వున్న వారికే టిక్కెట్ ఇస్తామని.. క్రియాశీలక కార్యకర్తలే జనసేన పార్టీ బలమని నాగబాబు పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త గ్రామాల్లో పది మంది తటస్థ ఓటర్లతో ఓటు వేయించేలా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments