ఆడవారి బట్టల పై మాట్లాడిన ఎస్పీ బాలుకు నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు ఈ మధ్య యూట్యూబ్‌లో బాగా హల్ చల్ చేస్తున్నాడు. ‘మై చానెల్ నా ఇష్టం’ అంటూ ఓ యూ ట్యాబ్ చానెల్‌ను ప్రారంభించిన ఆయన.. తన తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు మైలేజీ పెంచడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇప్పటికే పవన్ గురించి మాట్లాడిన కొందరు నేతలకు.. మరీ ముఖ్యంగా నోరు జారిన బాలయ్య, చంద్రబాబు, లోకేశ్, వైఎస్ జగన్ ఇలా అందరిపై వీడియోల రూపంలో నాగబాబు కౌంటర్లు పేలుస్తూ వచ్చాడు. అయితే అంతీ రితిలో ఆయనకు రివర్స్ కౌంటర్లు వచ్చాయి అవన్నీ ఇక్కడ అప్రస్తుతం. తాజాగా తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో హీరోయిన్స్ డ్రెస్సింగ్ స్టెయిల్పై లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బాలు వ్యాఖ్యలపై ఇంతవరకూ ఎవరూ స్పందించలేదు. అయితే ఫస్ట్ట్ టైమ్ నాగబాబు మాట్లాడుతూ బాలు పేరు చెప్పకుండా పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
డ్రెస్‌లు గురించి చెప్పడానికి మీరెవరు..!?
"ఈ మధ్యన కొంతమంది మహానుభావులు, పెద్దవాళ్లు, గౌరవనీయులైన వ్యక్తులు.. వాళ్ల పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. మన తెలుగు ఇండస్ట్రీలో అత్యంత ప్రముఖుడైనటువంటి సంగీత సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన ఆ మహానుభావులు ఆడవాళ్ల డ్రెస్సింగ్ విధానంపై మాట్లాడారు. అలాగే ప్రవచనాలు చెప్పే వ్యక్తితో పాటు మరో నటుడు పార్లమెంట్లో ఆడవాళ్ల వస్త్రధారణపై మాట్లాడారు. వాళ్లేమంటారంటే.. ఆడవాళ్లు సాంప్రదాయంగా డ్రెస్‌లు వేసుకోవాలి. శరీరాన్ని ఎక్స్పోజ్ చేస్తూ డ్రెస్‌లు వేసుకోకూడదు. దానివల్ల మగవాళ్ల దృష్టి ఆడవాళ్లపై పడి అత్యాచారాలు, అవాంచనీయ సంఘటనలకు కారణం అవుతుంది. కాబట్టి కొంచెం సాంప్రదాయబద్ధంగా శరీరాన్ని కప్పుకునే విధంగా బట్టలు వేసుకోమని చెప్తున్నారు. దీనిలో నాకు అర్ధం కాని విషయం ఏంటంటే.. అసలు ఒక ఆడపిల్ల గురించి ఆడవాళ్ల డ్రెస్‌లు ఇలా వేసుకోవాలని చెప్పడానికి మీరెవరు? మీకు ఎవరు అధికారం ఇచ్చారు. సాంప్రదాయం, మతం ముసుగులో కూర్చుని ఆడపిల్లలు ఇలాంటి డ్రెస్‌లు వేసుకోకూడదని చెప్తారా.. అలాంటి డ్రెస్‌ల వల్ల మగవాళ్ల కోరికలు పెరుగుతున్నాయి అంటారా.. నాకు తెలిసినంతవరకూ అత్యాచారాలు చాలా వరకూ ఒళ్లంతా కప్పుకున్న వాళ్లపైనే జరిగాయి" అని నాగబాబు చెప్పుకొచ్చాడు.
అలా డ్రెస్‌లు వేసుకుంటే తప్పేంటి?
"మగవాడి కామదృష్టికి నీచమైన ఆలోచనకి శరీరాన్ని కప్పుకున్నా.. ఎక్స్పోజ్ చేసినా వాడి బుద్ది మారదు. అలాంటి వాళ్లకోసం మీరు డిక్టేట్ చేస్తారా? ఆడవాళ్లు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి? సినిమా హీరోయిన్లు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అని. డ్రెస్ వేసుకోవడం అనేది వాళ్ల హక్కు. వాళ్లు అందంగా కనబడాలనుకుంటున్నారా? ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నారా? అట్రాక్ చేయాలనుకుంటున్నారా అనేది వాళ్ల ఇష్టం. మధ్యలో మీరెవరు చెప్పడానికి. వాళ్లు అలా డ్రెస్‌లు వేసుకుంటే తప్పేంటి? అదే ఆడవాళ్లు తిరగబడి.. మీ మగవాళ్లు పంచెలు కట్టుకోకండి.. మీరు ఫ్యాంటులు వేసుకోకండి.. నిక్కర్లు వేసుకోకండి.. పొట్టలు వేసుకుని, బనియన్లు వేసుకుని తిరుగుతున్నారు. చూడలేక చస్తున్నాం.. అవి వేసుకోవడం మానేయండి అని ఏ అమ్మాయైనా అన్నదా? ఇప్పటి వరకూ మగవాడి డ్రెస్ ఇలా వేసుకోవాలని ఏ ఆడపిల్లా కండిషన్స్ పెట్టలేదు. మీరు ఇంకా పాత బూజుపట్టిన సాంప్రదాయాలను పట్టుకుని వేలాడుతున్నారు. గబ్బిలాలు లాగ. ఇకనైనా మారండి" అని ఒకింత నాగబాబు హెచ్చరించింనట్లుగా చెప్పాడు.
నీచమైన చూపు నుంచి బయటపడండి..!
"పలానా హీరోయిన్ పొట్టి డ్రెస్ వేసుకుంది. క్యారెక్టర్ కోసం ఎట్రాక్ట్ చేస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారే.. అసలు మీ దృష్టి వాళ్ల డ్రెస్ మీదికి ఎందుకు వెళ్తుంది. మీ కళ్లు ఆమె డ్రెస్‌ని ఎందుకు చూస్తున్నాయ్. ఆ అమ్మాయి తొడలు కనిపిస్తున్నాయ్.. బొడ్డు కనిపిస్తుంది.. ఈ దృష్టి మీకు ఎందుకు వచ్చింది. ఏ.. మీరు చూడకుండా ఉండలేరా? ఫస్ట్ మీ వక్రబుద్ధి మార్చుకోండి. మీరు చూసే చూపుఉంటుందే ఆ నీచమైన చూపునుండి బయటపడండి. మీరు చూసేదంతా చూసేని చప్పలించేస్తారు. తరువాత స్టేజ్‌ల మీదికొచ్చి కబుర్లు చెప్తారు. ఆపండి సార్.. వాళ్లు నిజంగా ఒళ్లంతా విప్పుకుని రోడ్లుమీద తిరిగితే చట్టాలు ఉన్నాయి. వాళ్లు కూడా మగాళ్ల వస్త్రధారణపై కండిషన్ పెట్టి రోడ్డు ఎక్కితే దూలతీరిపోద్ది మీకు"అంటూ నాగబాబు ఫైర్ అయ్యాడు.
నాగబాబుపై నెటిజన్లు కన్నెర్ర..!
గత కొద్దిరోజులుగా నాగబాబు చేస్తున్న వీడియోలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జనసేనను మైలేజీ పెంచడానికి జాకీలేసి మరీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవ్ లేండి సార్.. మీ వల్ల జనసేనకు నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని నెటిజన్లు ఓ రేంజ్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజా వీడియోపై స్పందిస్తూ.. ‘మంచి బట్టలు వేసుకోమనడం కూడా తప్పేనా.. భారతీయ సాంప్రదాయాలను గౌరవించడం, గౌరవించబడేలా చూడటం ప్రతి భారతీయుడి హక్కే" అనే విషయం నాగబాబుకి తెలియదా? అని నాగబాబుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే నాగబాబు వ్యా్ఖ్యలపై నటీనటులు, ఎస్పీ బాలసుబ్రమణ్యం నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com