అన్నయ్య కాంగ్రెస్, పవన్ జనసేన.. ప్రకాష్ రాజ్ పై నాగబాబు కామెంట్స్!
- IndiaGlitz, [Tuesday,June 22 2021]
'మా' అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం రోజు రోజుకూ హీటెక్కుతోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, యువ హీరో మంచు విష్ణు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. దీనితో 'మా' ఎన్నిక పోరు రసవత్తరంగా మారింది. ఇద్దరూ అప్పుడే గ్రౌండ్ వర్క్ ప్రారంభించి మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు లాంటి సీనియర్ నటుల మద్దతు విష్ణుకి ఉన్నట్లు తెలుస్తోంది. తన తండ్రి మోహన్ బాబు పరపతి ఎలాగూ ఉంటుంది. ఇక ప్రకాష్ రాజ్ విషయానికి వస్తే.. మహేష్ బాబు, చిరంజీవి, పవన్, ఎన్టీఆర్, దిల్ రాజు ఇలా స్టార్ నటులు, నిర్మాతలకు ఆయన అభిమాన నటుడు. వారి మద్దతు ప్రకాష్ రాజ్ కు ఉండే అవకాశం ఉంది. అయితే మోహన్ బాబు, చిరంజీవి ఇద్దరూ మంచి మిత్రులు.
ఇదిలా ఉండగా మెగా బ్రదర్ నాగబాబు బహిరంగంగానే ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలపడం ఆసక్తిగా మారింది. ఓ ఇంటర్వ్యూలో నాగబాబు ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలిపారు. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అని వస్తున్న విమర్శలని నాగబాబు ఖండించారు. ప్రకాష్ రాజ్ దేశం మొత్తం ఖ్యాతి గడించిన నటుడు. అలాంటి నటుడు మా ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పేముంది అని నాగబాబు ప్రశ్నించారు.
ప్రాంతాలు వేరైనప్పటికీ తాము నటులం కాకుండా పోతామా అని నాగబాబు అన్నారు. మా ఇంట్లోనే తీసుకుంటే ఒకప్పుడు అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీ ఉంది. వారిద్దరి ఐడియాలజీ మాత్రమే వేరు.అంతమాత్రాన అన్నదమ్ములు కాకుండా పోతారా ? ఇతర విషయాలని షేర్ చేసుకోకుండా పోతారా ? అని నాగబాబు అన్నారు.
తాను సినిమాలు చేస్తున్న తెలుగు ఇండస్ట్రీని బాగు చేసుకోవాలి అన్న ప్రకాష్ రాజ్ ఆలోచన అభినందనీయం. ఈ టైంలో ప్రకాష్ రాజ్ మరికొన్ని సినిమాలు చేసుకుని డబ్బు సంపాదించుకోవచ్చు. ప్రకాష్ రాజ్ లాంటి నటుడు తెలుగు ఇండస్ట్రీని ఓన్ చేసుకోవడం మన అదృష్టం నాగబాబు అన్నారు.