Nagababu:చర్యకు ప్రతిచర్య ఉంటుంది.. టీడీపీకి కౌంటర్‌గా నాగబాబు ట్వీట్..

  • IndiaGlitz, [Saturday,January 27 2024]

టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు రచ్చకు దారి తీస్తోంది. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించకుండా అభ్యర్థులను ప్రకటించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది కాబట్టి తాను కూడా రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తానని పవన్ తెలిపారు. దీంతో కూటమిలో అసలు ఏం జరుగుతుందోననే గందరగోళం నెలకొంది. అయితే పవన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని.. టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చాలా వరకు ఫైనల్ అయిందన్నారు. జనసేన పోటీచేసే సీట్లనే పవన్ కల్యాణ్ ప్రకటించారని స్పష్టంచేశారు.

ఇదిలా ఉంటే తాజాగా జనసేన నేత నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. టీడీపీ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం, దానికి కౌంటగా జనసేన కూడా రెండు స్థానాలను ప్రకటించడాన్ని పరోక్షంగా ఉద్దేశించి పోస్ట్ చేశారు. చర్యలకు ప్రతిచర్య ఉంటుందని అర్థం వచ్చేలా న్యూటన్ నియమాలు తెలియజేస్తూ పోస్టు చేశారు. అయితే తాను పెట్టే ప్రతీపోస్టుకు అర్థం ఉంటుందని అనుకోవద్దని సూచించారు. కొన్నిసార్లు సమాచారం మాత్రమే పోస్టు చేస్తానని, ఇప్పుడు ఫిజిక్స్ లా పెట్టానని తెలిపారు. రేపు మరికొన్ని పోస్టులు కూడా చేస్తానని తెలియజేశారు. వీటి గురించి ఆలోచించకూడదని, గుమ్మడికాయల దొంగలు అవ్వొద్దని ఆయన సూచించారు.

ఇప్పుడే ఇరు పార్టీల మధ్య మొదలైన లుకలుకలు ఎటూ దారి తీస్తాయో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగబాబు చేసిన ట్వీట్‌తో టీడీపీ-జనసేన మధ్య ఏం జరుగుతుందనే దానిపై ఆసక్తికరంగా మారింది. అయితే టీడీపీ నేతలు మాత్రం వైసీపీకి కౌంటర్‌గా ఈ ట్వీట్ చేశారని చెబుతున్నారు. మొత్తానికి నాగబాబు ప్రస్తుతం చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. టీడీపీతో పొత్తు కొనసాగిస్తూనే తాము అనుకున్న సీట్లు సాధించేలా చంద్రబాబుపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.