రాజధాని భూములపై లెక్కలు చెప్పిన నాగబాబు!
- IndiaGlitz, [Monday,December 23 2019]
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండొచ్చేమోనన్న సీఎం వైఎస్ జగన్ ప్రకటనను చాలా వరకు స్వాగతించగా.. కొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పబట్టగా.. మెగాస్టార్ చిరంజీవి మాత్రం జగన్‌కే జై కొట్టారు. మరోవైపు అమరావతిలో రైతులు ఆందోళనకు దిగగా.. వారికి జనసేన సంపూర్ణ మద్దతు ప్రకటించిన పవన్.. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా.. జనసేన ముఖ్యనేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు సూచించారు. అధినేత ఆదేశాల మేరకు వారిద్దరూ వెళ్లి రైతులకు మద్దతిచ్చారు. ఈ వ్యవహారంపై తాజాగా ‘మై చానెల్ నా ఇష్టం’ యూ ట్యూబ్ చానెల్‌లో ఓ వీడియో చేశారు.
వాస్తవంగా జరిగి ఉండొచ్చు! ‘రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు జరిగిన అన్యాయాన్ని నేను కళ్లారా చూశాను. జనసేన నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి మేం మందడం వెళ్లాం. అక్కడ రైతుల బాధలను తెలుసుకున్నాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో అమరావతిలో సేకరించిన మొత్తం భూమి 34,322 ఎకరాలు. భూములు ఇచ్చిన రైతుల సంఖ్య 29,881. అయితే.. ఇందులో ఐదు వేల ఎకరాల్లో అవకతవకలు జరిగాయని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. అది వాస్తవంగా జరిగి ఉండొచ్చు. దీనిపై పూర్తి విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలి. దేశంలో కుహనా లౌకిక ఉదారవాదుల వల్ల ఈ దేశానికి చాలా చాలా నష్టం జరిగింది.. జరుగుతోంది.. జరగబోతోంది’ అని నాగబాబు వీడియోలో, ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు.