నిర్మాత‌గా మారుతున్న చైత‌న్య‌

  • IndiaGlitz, [Tuesday,February 25 2020]

అక్కినేని వార‌సుల్లో మూడో త‌రం హీరోలుగా అక్కినేని చైత‌న్య‌, అఖిల్ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులే. ఇందులో అఖిల్ నాలుగో సినిమానే చేస్తుండ‌గా చైత‌న్య హీరోగా స‌క్సెస్‌లు సాధించాడు. హీరోయిన్ స‌మంత‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ అక్కినేని హీరోలంటే ట‌క్కున గుర్తుకొచ్చే పేరు అన్న‌పూర్ణ స్టూడియోస్‌. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మ‌ద్రాసు నుండి హైద‌రాబాద్ రావ‌డానికి కార‌ణ‌మైన అక్కినేని నాగేశ్వ‌ర‌రావు నిర్మించిన ఈ స్టూడియో వ్య‌వ‌హారాల‌ను ఇప్పుడు అక్కినేని నాగార్జున ఇత‌ర కుటుంబ స‌భ్యులు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇది కాకుండా నాగార్జున, అత‌ని కొడుకులు మాత్ర‌మే క‌లిసి మ‌నం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అనే బ్యాన‌ర్‌ను కూడా పెట్టుకున్నారు.

అయితే ఇప్పుడు చైత‌న్య రూట్ మారుస్తున్నాడ‌ట‌. త‌ను ఓ సొంత నిర్మాణ సంస్థ‌ను పెట్టుకోవాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. కొత్త టాలెంట్‌ను, కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను నిర్మించాల‌ని చైత‌న్య ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టికే కొత్త క‌థ‌ల‌ను వింటున్నాడ‌ట‌. సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు చైత‌న్య ఓ డెబ్యూ డైరెక్ట‌ర్‌తో సినిమాను నిర్మించ‌బోతున్నాడ‌ట‌. హీరో ఎవ‌రో తెలుసా.. రాజ్‌త‌రుణ్‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబందించిన వివ‌రాలు తెలుస్తాయంటున్నారు. మ‌రో ప‌క్క చైత‌న్య.. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో 'ల‌వ్‌స్టోరి' సినిమా చేస్తున్నాడు.