ప్రభాస్ 'బుజ్జి' కారును నడిపిన చైతన్య.. 'కల్కి' టీమ్‌కి హ్యాట్సాఫ్

  • IndiaGlitz, [Saturday,May 25 2024]

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ మేకర్స్ వేగవంతం చేశారు. ఇటీవల ఈ మూవీలో కీలక పాత్ర పోషించిన బుజ్జి కారును మేకర్స్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

ఎంతో టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ కారును ఒక్కసారైనా న‌డ‌పాల‌ని ఉందంటూ సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు కామెంట్లు పెడుతున్నారు. ఈ వరుసలో అక్కినేని నాగచైతన్య కూడా చేరిపోయాడు. చైతుకు కార్లు, బైకులు న‌డ‌ప‌డం అంటే ఎంత ఆస‌క్తి. రేసింగ్ గేమ్స్‌లోనూ సంద‌డి చేస్తుంటాడు. తాజాగా బుజ్జిని కూడా డ్రైవ్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం అభిమానుల‌తో పంచుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది.

ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ బుజ్జిని న‌డ‌ప‌డం ఎంతో అద్భుతంగా ఉంద‌ని తానింకా షాక్‌లో ఉన్నట్లు తెలిపాడు. ఇంజినీరింగ్‌కు సంబంధించిన రూల్స్ అన్ని 'క‌ల్కి' మూవీ టీమ్ బ్రేక్ చేసింద‌ని చెప్పుకొచ్చాడు. ఇలాంటి కారును త‌న జీవితంలో న‌డుపుతాన‌ని ఊహించ‌లేద‌న్నాడు. ఇదొక ఇంజినీరింగ్‌ మార్వెల్‌ అని.. దర్శకుడి ఊహాశక్తిని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చిన టీమ్‌కు హ్యాట్సాఫ్ చెప్పాడు. బుజ్జితో గడిపిన స‌మ‌యాన్ని ఎప్పటికీ మ‌రువ‌లేన‌ని పేర్కొన్నాడు. కాగా 6 టన్నులు బరువు, మూడు టైర్లు ఉండే ఈ కారును ప్రత్యేకంగా మహేంద్ర, జయం మెటార్స్ కంపెనీలు ప్రత్యేకంగా తయారుచేశాయి.

మరోవైపు ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్స్ ఇప్పటికే ఫిక్స్ అయ్యాయి. 'కల్కి 2989 ఏడీ' హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. ఇక తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో వీక్షకులకు అందుబాటులోకి రానుంది. హిందీ వెర్షన్‌ను రూ.200 కోట్లకు, సౌత్ వెర్షన్‌ను రూ.175కోట్లకు ఆయా ఓటీటీలు కొనుగోలు చేసినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మూవీ విడుదలకు ముందే రికార్డులు సృష్టి్స్తుంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో లోక నాయకుడు కమల్‌ హాసన్‌ విల‌న్‌గా నటించనుండగా.. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, రానా, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.