కేసీఆర్ అంటే మాకు భయం లేదు.. కానీ.. నాగబాబు
- IndiaGlitz, [Thursday,May 02 2019]
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే మాకు భయం లేదని.. గౌరవం మాత్రమే ఉందని నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థి నాగేంద్ర బాబు చెప్పుకొచ్చారు. పవన్ పోటీ చేసిన గాజువాక నియోజకవర్గంలో బుధవారం నాడు జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాగబాబు మాట్లాడుతూ.. ఇది టీజర్ మాత్రమేనని.. మే 23 తర్వాత 2024 వరకు అసలు సినిమా ఉంటుందన్నారు. నాయకుడి దగ్గర నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు మార్పు తీసుకురావాలన్న కసితో పనిచేశారు. నరసాపురంలో నాతో పని చేసిన కార్యకర్తలు కనీసం భోజనం కూడా ఆశించలేదు. అందరిలో మార్పు తేవాలన్న బలమైన ఆకాంక్షే అందుకు కారణం. అందరి ఆలోచనలకి సరిపడిన నాయకుడి రూపంలో పవన్‌కళ్యాణ్ దొరికారు. పవన్‌కళ్యాణ్‌తో పని చేస్తే తాము అనుకున్నది సాధించవచ్చన్న నమ్మకంతో అంతా కలసి పని చేయడానికి ముందుకు వచ్చారు. రాజకీయం ఓ మాఫియాలా తయారైంది. ఎక్కడ చూసినా మట్టి మాఫియా, ఇసుక మాఫియా, ఫిష్ మాఫియా. ఇలాంటి వ్యవస్థను మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నంలో నాకు అవకాశం దక్కడం సంతోషంగా ఉంది అని నాగబాబు చెప్పుకొచ్చారు.
సోకాల్డ్ నాయకులకు దమ్ము లేదు..!
తెలంగాణలో 17 మంది విద్యార్ధులు చనిపోతే ఎవ్వరికీ నోరు లేవలేదేం..? అప్పుడు కూడా పవన్‌కళ్యాణ్ మాత్రమే మాట్లాడారు.. జనసైనికులు మాట్లాడారు.. శంకర్‌గౌడ్ మాట్లాడారు. అదే జనసేన స్ఫూర్తి. విద్యార్ధులు చనిపోవడం వెనుక ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం, ప్రభుత్వ అసమర్ధత ఉన్నాయి. దాన్ని ప్రశ్నించడానికి ఈ సోకాల్డ్ నాయకులకు దమ్ములేదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలను ఎందుకు అడ్డుకున్నారని మాట్లాడే వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి.. విద్యార్ధుల సమస్య గురించి మాట్లాడరా?. ఆ దమ్ము ఎవరికీ లేదు. తెలంగాణలో కూడా పని చేసే దమ్ము జనసేనకు మాత్రమే ఉంది. మీలా కేసీఆర్ అంటే మాకు భయం లేదు. గౌరవం మాత్రమే ఉంది. ఇది టీజర్ మాత్రమే. మే 23 తర్వాత 2024 వరకు అసలు సినిమా ఉంటుంది అని నాగబాబు తెలిపారు. సో.. ఈ వ్యాఖ్యలపై వైసీపీ, టీఆర్ఎస్ నేతల నుంచి ఎలా రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.