ఈ వారం నో ఎలిమినేషన్... కారణం చెప్పిన నాగ్

  • IndiaGlitz, [Monday,September 12 2022]

బిగ్‌బాస్ 6 తొలి వారం విజయవంతంగా పూర్తి చేసుకుంది. అప్పుడే కొందరు కంటెస్టెంట్స్ జనానికి నోటెడ్ అయ్యారు. గలాటా గీతూ, రేవంత్, రోహిత్ , మెరీనా, ఫైమా, బాలాదిత్యల గురించి ఆడియన్స్ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సాధారణంగా ఆదివారం వచ్చిందంటే ఎవరు ఎలిమినేషన్ అవుతారోనన్న ఉత్కంఠ సహజం. కానీ ఆరో సీజన్ ఫస్ట్ వీక్ ఎలాంటి ఎలిమినేషన్ లేకుండా తుస్సుమంది. చివరికి ఓట్లు వేసిన జనాలను కూడా బిగ్‌బాస్ టీమ్ నిరాశపరిచింది. శనివారం మధ్యాహ్నం నుంచే దీనికి సంబంధించి లీకులు మొదలైనా ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. తీరా చూస్తే చివరికి ఆ లీకులే మొదలయ్యాయి.

ఆదివారం వచ్చి రాగానే కంటెస్టెంట్స్ ఒకరి గురించి మరొకరు ఏం తెలుసుకున్నారంటూ నాగ్ అడిగారు. ఇందులో గెలిచిన వారికి ‘స్టార్ ఆఫ్ ది వీక్ ’ అనే ట్యాగ్ వస్తుందని ఆయన తెలిపారు. ఈ టాస్క్‌లో అందరికంటే ఎక్కువ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చి బాలాదిత్య ‘స్టార్ ఆఫ్ ది వీక్’గా నిలిచాడు. అంతేకాదు అతనికి స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. అనంతరం ఈవారం నామినేషన్స్‌లో వున్న వారిని సేవ్ చేసే ప్రక్రియ మొదలుపెట్టాడు నాగ్. అభినయశ్రీ, రేవంత్, అరోహి, ఫైమా, ఇనయాల చేతికి ఓ బ్యాటిన్ ఇచ్చి దానిని తెరవాలని చెప్పారు. అందులో బ్లూ కలర్ వచ్చిన వాళ్లు సేవ్ అవుతారని అన్నాడు. వీరిలో ఫైమా సేవ్ అయ్యింది.

మళ్లీ కంటెస్టెంట్స్‌లో టెన్షన్ పొగొట్టేందుకు ‘ఐటెం నంబర్ గేమ్’ ఆడించాడు నాగ్. తాను ఏ వస్తువును చూపిస్తే దానికి సంబంధించని పాట ఏదో చెప్పాలన్నాడు. ఇంటి సభ్యులను ఏ, బీ టీమ్‌లుగా విభజించాడు. టీమ్ ఏలో... చంటి, శ్రీసత్య, రేవంత్, నేహా, అభినయ, అర్జున్, మెరీనా, రోహిత్, కీర్తి, షానీ, ఇనయాలు.. టీమ్ బీలో మిగిలిన సభ్యులు వున్నారు. ఈ క్రమంలోనే ఈ హౌస్‌లో వున్న బుట్టబొమ్మ ఎవరు అని బాలాదిత్యను నాగ్ అడిగితే.. మెరీనా అని సమాధానం చెప్పాడు. ఇక వరుసగా అభినయ శ్రీని.. రౌడీ అని, కీర్తిని బంగారు తల్లి, నేహాని.. స్ప్రింగ్ , ఇనయాని.. మిస్ స్మైల్ , ఆరోహిని.. సీమటపాకాయ్, వాసంతిని.. గ్లామర్ ఆఫ్ బిగ్ బాస్, ఫైమా ఫ్లవర్ కాదు ఫైర్, గీతూ గీతక్క సీతక్క అంటూ ఒక్కొక్కరికి ట్యాగ్ ఇచ్చాడు బాలాదిత్య.

నామినేషన్‌లో వున్న రేవంత్, అభినయశ్రీ, ఆరోహి, ఇనయాలకు బాక్స్ టాస్స్ ఇచ్చి రేవంత్ సేఫ్ అని చెప్పాడు. తర్వాత అభినయశ్రీ, ఆరోహి, ఇనయాలకు కొబ్బరికాయ టాస్క్ ఇచ్చి ఆరోహి సేఫ్ అయినట్లు ప్రకటించారు నాగ్. దీంతో చివరికి అభినయశ్రీ, ఇనయాలు మాత్రమే నామినేషన్స్‌లో మిగలడంతో ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారోనన్న టెన్షన్ పట్టుకుంది. అనంతరం వారిద్దరిని గార్డెన్ ఏరియాలోకి పిలిచాడు నాగ్. వారికి సుత్తి టాస్క్ ఇచ్చారు. సుత్తి ఎవరైతే ఎత్తగలరో వారు సేవ్ అవుతారని చెప్పాడు నాగ్. అయితే ఇనయా, అభినయాలిద్దరూ సుత్తిని ఎత్తడంతో ఇద్దరూ సేఫ్ అని ప్రకటించాడు. ఈ వారం ఎలిమినేషన్ లేకపోవడంపైనా నాగ్ క్లారిటీ ఇచ్చారు. అందరికీ ఇది తొలి వారమేనని, ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి టైం పడుతుందని అందుకే ఎవరిని ఎలిమినేషన్ చేయడం లేదని నాగార్జున స్పష్టం చేశారు.