షార్ట్ ఫిల్మ్ చూసి ఆయన్ను వెతికి పట్టుకున్నా: నాగ్ అశ్విన్
Send us your feedback to audioarticles@vaarta.com
‘మహానటి’తో తెలుగు సినిమాను జాతీయస్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఆయన నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ‘జాతి రత్నాలు’. అనుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. ఫుల్‌లెంగ్త్ కామెడీ చిత్రంగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు.
తనకు జంధ్యాల, ఎస్వీ కృష్ణారెడ్డి గారి సినిమాలంటే చాలా ఇష్టమని... అలాంటి క్లీన్ కామెడీ కథలను సినిమాగా తీయాలని ఉండేదని నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఆ క్రమంలోనే అయిదారేళ్ల క్రితం అనుదీప్ తీసిన ఒక షార్ట్‌ఫిల్మ్ చూశానని... కడుపుబ్బా నవ్వుకునే అమాయకత్వంతో కూడిన హాస్యం ఉందన్నారు. దాంతో అతన్ని వెతికి పట్టుకుని సినిమా తీయాలనుకున్నానన్నారు. అయితే ఆయన రెండు కథలను వివరించారని.. దానిలో చివరిగా ‘జాతిరత్నాలు’ ఫైనల్ చేశామన్నారు. ఇలాంటి హ్యుమర్ ఉన్న సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తాయి. అనుదీప్‌కు కొన్ని సలహాలు, సూచనలు మాత్రమే ఇచ్చానన్నారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’కి పని చేస్తున్నప్పటి నుంచి తనకు విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి తెలుసని నాగ్ అశ్విన్ తెలిపారు.
అసలు ముందు ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రాన్ని చిన్న బడ్జెట్‌లో వీరిద్దరినీ పెట్టి తెరకెక్కిద్దామనుకున్నామని.. కానీ కుదరలేదన్నారు. రెండేళ్ల ముందు నుంచే ‘జాతి రత్నాలు’ కథతో ట్రావెల్ అయ్యామన్నారు. ముగ్గురు సిల్లీ ఫెలోస్ ఒక సీరియస్ క్రైమ్‌లో ఇరుక్కుంటే ఎలా ఉంటుందనేది ఎంతో హాస్యంగా చూపిస్తామన్నారు. ఒకలాంటి అమాయకత్వంతో కూడిన కామెడీ ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుందని నాగ్ అశ్విన్ తెలిపారు. అప్పట్లో వచ్చిన ‘మనీ’ ‘అనగనగా ఒకరోజు’ లాంటి కామెడీ మా చిత్రంలోనూ కనిపిస్తుందన్నారు. ఈ సినిమాకు అనుదీప్ మొదట ‘ఆణిముత్యాలు’ ‘సుద్దపూసలు’ అనే టైటిల్స్ సూచించాడని... చివరకు ‘జాతి రత్నాలు’అనుకున్నామని నాగ్ అశ్విన్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout