నాదెండ్ల కీలక నిర్ణయం.. నేడు బీజేపీలోకి!
- IndiaGlitz, [Saturday,July 06 2019]
అవును మీరు వింటున్నది నిజమే.. మాజీ ముఖ్యమంత్రి, 1980 దశకంలో ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నాదెండ్ల భాస్కరరావు నేడు కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో నాదెండ్ల బీజేపీ కండువా కప్పుకోబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్టు బీజేపీ వర్గాలు మీడియాకు తెలిపాయి. కాగా.. ఇవాళ సాయంత్రం షా హైదరాబాద్‌కు రానున్నారు.
1978లో తొలిసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన నాదెండ్ల.. 1982లో ఎన్టీఆర్ టీడీపీని పెట్టడంలో కీలక పాత్ర పోషించారని చెబుతుంటారు. అంతేకాదు.. ఎన్టీఆర్‌తో కలిసి నడిచిన ఆయన ఆ తర్వాతి ఏడాదే ఎన్టీఆర్‌ను పీఠం నుంచి దింపేసి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 వరకు కేవలం నెల రోజులు మాత్రమే ఆయన సీఎం సీటులో కూర్చోగలిగారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1998లో కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత సుమారు రెండు దశాబద్దాలకు పైగా రాజకీయాల్లో చురుగ్గా లేరు.
అయితే.. 2019 ఎన్నికలకు ముందు నాదెండ్ల కాస్త యూట్యూబ్ పొలిటికల్ స్టార్‌గా మారిపోయి.. ఎన్టీఆర్, చంద్రబాబు గురించి షాకింగ్ విషయాలు చెబుతూ అందర్నీ ఆలోచనలో పడేశారు. అయితే ఇప్పుడు ఏకంగా బీజేపీలో చేరుతున్నట్లు నాదెండ్ల తీసుకున్న షాకింగ్ డెసిషన్‌తో అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఈయన్ను బీజేపీలో చేరమని ఎప్పుడో కమలనాథులు సంప్రదించారు. కాస్త టైమ్ కావాలని కోరిన ఆయన.. బీజేపీలో చేరాలని ఫిక్స్ అయిపోయారు.
ఇదిలా ఉంటే.. నాదెండ్ల కుమారుడు మనోహర్ ప్రస్తుతం జనసేనలో కీలకనేతగా ఉన్నారు. అంతేకాదు.. తండ్రి ఈ నిర్ణయం తీసుకున్న టైమ్‌లో మనోహర్ తానా మహాసభల్లో బిజిబిజీగా ఉన్నారు. అప్పట్లో నాదెండ్ల మనోహర్ జనసేనకు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరతాని టాక్ నడిచింది. తండ్రి కాషాయం కండువా కప్పుకున్న తర్వాత.. మనోహర్ కూడా కప్పుకుంటారో లేకుంటే జనసేనలోనే కంటిన్యూ అవుతారో వేచి చూడాల్సిందే మరి.