Nadendla:జనసేన కార్యకర్తల కుటుంబాలకు రూ.5లక్షల బీమా చెక్కు అందజేసిన నాదెండ్ల
Send us your feedback to audioarticles@vaarta.com
రెండు రోజుల పర్యటనలో భాగంగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు బండారు వెంకటరాజు కుటుంబసభ్యులను ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. వెంకటరాజు మృతికి గల కారణాలు, కుటుంబ స్థితిగతులపై ఆరా తీశారు. అనంతరం మృతుడి భార్య శ్రీలక్ష్మికి పార్టీ తరపున రూ.5లక్షల బీమా చెక్కును అందజేశారు. పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని నాదెండ్ల భరోసా ఇచ్చారు.
త్వరలోనే ఇంటింటికీ టీడీపీ, జనసేన కార్యక్రమం..
ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్ర ప్రజలంతా కంకణం కట్టుకున్నారని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అనుభవం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలోచన రాష్ట్రానికి ఎంతో అవసరం అని తెలిపారు. జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళతాయని పేర్కొన్నారు. త్వరలోనే ఉమ్మడి ప్రణాళికతో టీడీపీ, జనసేన ఇంటింటికీ వెళ్లే కార్యక్రమం చేపడతామన్నారు. కొత్తపేట మండలం అల్లపల్లివారిపాలెం, వానపల్లి గ్రామాలలో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఇద్దరు జనసేన పార్టీ కార్యకర్తలకు రూ. 5లక్షల ప్రమాద బీమా చెక్కులు అందించినట్లు వెల్లడించారు.
నాదెండ్లకు ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు..
అంతకుముందు ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా రావులపాలెం చేరుకున్న నాదెండ్ల మనోహర్‌కు కోనసీమ ముఖద్వారం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి కొత్తపేట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నాదెండ్లకు స్వాగతం పలికిన వారిలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ, కొత్తపేట ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, మండపేట ఇంచార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ తదితరులు ఉన్నారు. ఈనెల 19న కాకినాడలో పార్టీ ముఖ్యనాయకులు, నియోజవర్గాల ఇంచార్జీలతో మనోహర్ భేటీ కానున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments