మోడీ కేబినెట్ లోకి పవన్.. నాదేండ్ల మనోహర్ రెస్పాన్స్
- IndiaGlitz, [Tuesday,July 06 2021]
రాజకీయ కార్యక్రమాలకు కొంత బ్రేక్ ఇచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను కమిటై ఉన్న సినిమాలని ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ప్రజలకు కీలకమైన సమస్యలు ఎదురైనప్పుడు మాత్రం పవన్ షూటింగ్స్ పక్కన పెట్టి స్పందించేందుకు ముందుకు వస్తున్నారు.
మంగళవారం పవన్ కళ్యాణ్ విజయవాడకు వెళుతున్నారు. అక్కడ రెండు రోజుల పాటు పవన్ జనసేన పార్టీ కీలక నేతలతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. సభ్యులతో ప్రభుత్వ విధి విధానాలపై చర్చించనున్నారు. పార్టీ కేడర్ కు ఎలాంటి దిశా నిర్దేశం చేయాలి అనే విషయాలు నిర్వహించనున్నారు.
ముఖ్యంగా జగన్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై యువత తీవ్ర అసంతృప్తిలో ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తమ తరుపున పోటీ చేయాలంటూ కూడా యువత జనసేన పార్టీకి లేఖ రాశారు. ఈ అంశాలన్నీ పార్టీ సమావేశంలో చర్చకు రానున్నాయి.
జనసేన పార్టీలో నంబర్ 2గా ఉన్న నాదేండ్ల మనోహర్ అన్ని కార్యక్రమాలని మోనిటరింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ ని విస్తరించబోతున్నారు అంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. బిజెపితో జనసేన పార్టీ పొత్తులో ఉంది. పైగా ఏపీ నుంచి మోడీ కేబినెట్ లో ఎవ్వరికి చోటు లేదు.
దీనితో పవన్ కళ్యాణ్ పేరు తెరపైకి వచ్చింది. పవన్ కి మోడీ తన కేబినెట్ లో చోటు కల్పించబోతున్నారని, మంత్రి పదవి ఇవ్వబోతున్నారని వార్తలు వచ్చాయి. పలు మీడియా సంస్థలు ఈ వార్తని పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. దీనితో తాజాగా నాదేండ్ల మనోహర్ స్పందించారు.
'పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చింది సమాజంలో మార్పు తీసుకురావడానికి. మార్పు అనే పెద్ద అంశంకోసం ఆయన పోరాటం చేస్తున్నారు. క్యాబినెట్ మినిస్టర్ పదవి లాంటి తాత్కాలిక విషయాలని పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోరు. ఆయనకు మోడీ కేబినెట్ లో చోటు దక్కుతోంది అనే వార్తలు పూర్తిగా అసత్యం' అని నాదెండ్ల మనోహర్ తేల్చేశారు.
ఏది ఏమైనా జగన్ జాబ్ క్యాలెండర్ పై పవన్ ఏం మాట్లాడబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, అయ్యప్పన్ కోషియం రీమేక్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శత్వంలో ఓ చిత్రం ఉంది.