Nadendla Manohar:జనసేన-టీడీపీ కూటమిని ఏ శక్తి ఆపలేదు.. వైసీపీని ఆంధ్ర నుంచి తరిమికొడదామని నాదెండ్ల పిలుపు

  • IndiaGlitz, [Monday,October 09 2023]

జనసేన-తెలుగుదేశం పార్టీలు కలిసి పనిచేస్తే ఏ శక్తి దాన్ని ఆపలేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయకత్వంలో మనందరం ముందుకు వెళ్దామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెనాలి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తెనాలి నియోజకవర్గం కొలకలూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ అన్నం పెట్టే అన్నదాతల కన్నీరు తుడవకపోతే ఎన్ని సంక్షేమాలు ఇచ్చినా, ఎన్ని బటన్లు నొక్కినా ఏం ఉపయోగమని ప్రశ్నించారు. రూ. 9.6 లక్షల కోట్లు అప్పులు చేసిన ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేకపోయిందని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఒక్క కంపెనీ కూడా రాలేదని.. దాదాపు 300 కంపెనీలు రాష్ట్రం నుంచి పారిపోయాయని ఎద్దేవా చేశారు.

3వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు..

రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు కన్నీరుపెడుతున్నారని.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగేళ్లలో దాదాపు 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలి మండలం కొలకలూరులో కూడా రైతులు సాగు నీరు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇటీవల ఖాజీపేట గ్రామ రైతులు తన దగ్గరికి వచ్చి కాలువలు పూడికలు తీయడం కోసం అధికారులు చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. సొంత నిధులతో తామే బాగు చేసుకుంటామని చెప్పారు. కాలువలను బాగు చేయడం ప్రభుత్వం విధి అని డీఈకి ఫోన్ చేశానని.. మీరు కాలువల పూడికలు తీయపోతే తానే స్వయంగా వచ్చి శ్రమదానం చేసి కాలువ పూడికలు తీయిస్తామని హెచ్చరించానని తెలిపారు. దాంతో వెంటనే స్పందించిన డీఈ వినాయక చవితి లోపు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని.. కానీ దసరా వచ్చినా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదని మండిపడ్డారు.

సొంత నిధుల నుంచి పవన్ కళ్యాణ్ రూ. 5 కోట్లు విరాళం ఇచ్చారు..

పురుగుల మందుల నుంచి విత్తనాల వరకు అధికారులే రైతుల వద్దకు వచ్చి అందిస్తారని రైతు భరోసా కేంద్రాలు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మాత్రం తేమశాతం అని చెప్పి 40 కిలోమీటర్ల దూరం ఉన్న మిల్లులు వద్దకు రైతులను పంపిస్తున్నారని ఫైర్ అయ్యారు. నివర్ తుపాన్ సమయంలో అధినేత పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలో పర్యటించి నష్టపోయిన ప్రతీ రైతు కుటుంబానికి రూ. 25వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అన్నపూర్ణ లాంటి ఉభయగోదావరి జిల్లాలతో పాటు కర్నూలు, అనంతపురం, చివరకు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన పులివెందులలో కూడా కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. సొంత నియోజకవర్గంలో రైతులు చనిపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏ స్థాయిలో భరోసా ఇవ్వాలని.. దాన్ని వదిలేసి హెలికాప్టర్‌లో తిరుగుతూ బటన్లు తొక్కుకుంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ తన సొంత నిధుల నుంచి రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చి కౌలు రైతు కుటుంబాలకు అండగా నిలబడ్డారని తెలిపారు.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గ్రామ వాతావరణాన్ని చెడగొట్టారు..

విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని కానీ ఎన్నికల్లో గెలవడం కోసం ముందొక మాట గెలిచాక మరో మాట మార్చకూడదని హితవు పలికారు. కాఫీ ఫ్యాక్టరీ వల్ల భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయని ఇక్కడ ప్రజలు చెబుతున్నారని.. ఇలాంటి సమస్య వస్తుందనే ముందుగానే ఊహించి తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామానికి రక్షితమంచి నీటి పథకం తీసుకొచ్చానని పేర్కొన్నారు. వల్లభాపురం నుంచి నీరు తీసుకొచ్చామని.. ఖాజీపేట వరకు ట్యాంకులు నిర్మించామని.. ఇక్కడి ప్రజలు వైద్య అవసరాల కోసం గుంటూరు వరకు వెళ్లాల్సి వస్తుందని తెనాలిలోనే ఆస్పత్రి నిర్మించామని గుర్తుచేశారు. ఆడబిడ్డలు సుఖంగా ప్రసవం జరగాలని తల్లిపిల్లల ఆస్పత్రి నిర్మిస్తే ... ఇప్పుడు ఆస్పత్రిలో వైద్య పరికరాలు పనిచేయని పరిస్థితి నెలకొందన్నారు. లక్షల కోట్లు అప్పులు తీసుకొస్తున్న ప్రభుత్వం ఆ డబ్బును ఏం చేస్తోందో వారికే తెలియాలన్నారు. 20 కిలోమీటర్ల దూరం రావడానికి కూడా ముఖ్యమంత్రి హెలికాప్టర్‌నే ఉపయోగిస్తారని.. రోడ్డు మీద నుంచి వస్తే ప్రజలు ఎక్కడ రోడ్ల గురించి నిలదీస్తారో అని ఆయనకు భయం పట్టుకుందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గ్రామాల్లో వాతావరణాన్ని పూర్తిగా చెడగొట్టారని మండిపడ్డారు.

వాలంటీర్లే మందు డోర్ డెలివరీ చేస్తున్నారు..

శాసనసభాపతిగా ఉన్న సమయంలో పాఠశాలల వద్ద ఉన్న బెల్ట్ షాపులను తొలగిస్తే... ఇప్పుడు వాలంటీర్లే మందును డోర్ డెలవరీ చేస్తున్నారని ఆరోపించారు. దేశమంతా డిజిటల్ పేమెంట్స్ ఉండాలని ప్రధాని మోదీ ఒకవైపు చెబుతుంటే రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం షాపుల వద్ద కేవలం క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మద్యం అమ్మకాల్లోనే ప్రభుత్వ పెద్దలు వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొడితే జనసేన పార్టీ వారికి అండగా నిలబడిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని.. లక్షలాది మంది యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారని వాపోయారు. జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులను మోసం చేశారన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర మారిపోయింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం జనసేన-తెలుగుదేశం కూటమిని ఆశీర్వదించండని విజ్ఞప్తి చేశారు. వైసీపీ చేసిన నష్టం నుంచి రాష్ట్రం కోలుకోవాలంటే మరో పదేళ్లు పడుతుందని.. మనందరం కలిసికట్టుగా పని చేస్తేనే వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేయగలమని నాదెండ్ల వెల్లడించారు.

More News

Shah Rukh Khan:బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ భద్రత Y ప్లస్ కేటగిరీకి పెంపు..

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్ ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు. ఈ రెండు సినిమాలు రూ.1000కోట్లు

Chandrababu Naidu:టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్లు కొట్టివేత

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్,

Bigg Boss 7 Telugu : శుభశ్రీ, గౌతమ్ ఔట్.. ట్విస్ట్ ఇచ్చిన నాగ్, బిగ్‌బాస్ హౌస్‌లోకి ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్

బిగ్‌బాస్ 7 తెలుగులో ఆదివారం నాటి ఎపిసోడ్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. ఊహించని ట్విస్టులు,

Ramya Krishna Meena:మంత్రి రోజాకు పెరుగుతున్న మద్దతు.. బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలని రమ్యకృష్ణ, మీనా డిమాండ్

టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి రోజాకు అలనాటి హీరోయిన్లు నుంచి మద్దతు పెరుగుతూనే ఉంది.

Bandla Ganesh:కూకట్‌పల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీపై క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి.