Nadendla Manohar:పవన్ వారాహి యాత్రను విజయవంతం చేయండి : జనసేన కేడర్‌కు నాదెండ్ల మనోహర్ పిలుపు
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న వారాహి యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. బుధవారం గుంటూరు జిల్లాలోని వేమూరు నియోజకవర్గం కొల్లూరు గ్రామానికి చెందిన జనసేన నేతలతో ఆయన ముచ్చటించి, స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రహదారుల దుస్థితి, జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల లేమి, లబ్దిదారులు ఇక్కట్లు, గిట్టుబాటు ధర లేక రైతులు పడుతున్న అవస్థలను కొల్లూరు మండల జనసేన నాయకులు మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన నాదెండ్ల గ్రామ కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలతో మమేకం కానున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 14 నుంచి ఆయన వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. ఈ మేరకు వారాహి యాత్ర పోస్టర్‌ను నాదెండ్ల మనోహర్ సోమవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. దీనితో పాటు రూట్ మ్యాప్, యాత్రలో పర్యటించనున్న జనసేన అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కర్తలను ఆయన ప్రకటించారు.
అన్నవరంలో పవన్ ప్రత్యేక పూజలు :
ఈ నెల 14న అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కత్తిపూడి జంక్షన్ మీదుగా పవన్ కల్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు , పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు మీదుగా .. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు, నర్సాపురం, భీమవరంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోందని నాదెండ్ల తెలిపారు.
ప్రతి నియోజకవర్గంలో జనవాణి :
వారాహి యాత్ర సాగే ప్రతి నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ యాత్రలో అన్ని వర్గాల ప్రజలను పవన్ కలిసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశామని.. ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజుల పాటు వారాహి యాత్ర కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం తాను బస చేసిన ప్రాంతంలోని స్థానిక సమస్యలపై పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారని నాదెండ్ల మనోహర్ చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments