పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు తగ్గించారా.. లేదా, ఆ సంతకాలు ఎందుకు చేశారు: జగన్‌‌పై నాదెండ్ల ప్రశ్నల వర్షం

  • IndiaGlitz, [Tuesday,June 06 2023]

పోలవరం ప్రాజెక్ట్ జగన్ పాపపు పథకంగా మారిందన్నారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. సోమవారం ఆయన గుంటూరులో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందన్నారు. దీనికి ఆమోదం తెలుపుతూ రెండు సంతకాలు చేసిందని.. తాము గతంలోనే చెప్పామని నాదెండ్ల గుర్తుచేశారు. ఇప్పుడు తాజాగా కేంద్రం ప్రకటనతో ఈ విషయం స్పష్టమైందని మనోహర్ అన్నారు. దీనిపై సీఎం జగన్, మంత్రి అంబటి రాంబాబులు వివరణ ఇవ్వాలని నాదెండ్ల డిమాండ్ చేశారు.

వాస్తవాలను దాచేలా అంబటి ప్రెస్‌మీట్:

పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.17,144 కోట్ల నిధులు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించిందని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మనోహర్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించనున్న నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరంపై జగన్ మీడియా సమక్షంలో సమీక్ష చేపట్టాలని మనోహర్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ను అటకెక్కించారని, ఇరిగేషన్ శాఖ మంత్రి ప్రజలకు వాస్తవాలు తెలియకుండా వుండేలా హడావుడిగా ప్రెస్ మీట్‌‌లను పెడుతున్నారని మనోహర్ ఆరోపించారు.

ఇప్పుడు ఉన్నపళంగా పోలవరానికి ఎందుకు:

2021లో పోలవరం ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేస్తామని చెప్పిన జగన్ ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని నాదెండ్ల ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నపళంగా జగన్ పోలవరం పర్యటనకు ఎందుకు వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. 14 వేల మంది పోలవరం నిర్వాసితులకు ఎలాంటి పరిహారం అందిస్తారని నాదెండ్ల నిలదీశారు. రిటైనింగ్ వాల్ డ్యామేజీకి కారణం అవినీతా, నాణ్యతా లోపమా అనేది చెప్పాలని ఆయన కోరారు.