Janasena: అనుకోని ప్రమాదాలు.. రోడ్డునపడ్డ జనసైనికుల కుటుంబాలు: నేనున్నానంటూ పవన్, బీమా అందజేసిన నాదెండ్ల
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రజలకు ఏదో ఒకటి చేయాలని, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించారు పవన్ కల్యాణ్. 2014లో పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు ఆయన తన కష్టాన్నే నమ్ముకుని ముందుకు వెళ్తున్నారు. పార్టీని నడిపేందుకే సినిమాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అటు అభిమానులు, కార్యకర్తలు సైతం తమ జేబుల్లోంచి ఎంతో కొంత తీసి పవన్‌కు బాసటగా నిలుస్తున్నారు. తన కోసం .. పార్టీ పటిష్టత కోసం ఎంతో చేస్తూ.. ప్రభుత్వంపై పోరాడుతున్న కార్యకర్తలకు పవన్ సైతం అండగా వుంటున్నారు. జనసేన క్రీయాశీలక కార్యకర్తల కోసం ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రమాదవశాత్తూ కార్యకర్త మరణించినా, అంగవైకల్యం బారిన పడినా వారిని, వారి కుటుంబాలకు అండగా వుండేందుకు బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చారు పవన్. జనసేనలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలను పార్టీ తరపున అందిస్తున్నారు.
గుంటూరు జిల్లాలో నాదెండ్ల పర్యటన :
ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఈ సందర్భంగా జనసైనికులతో సమావేశమవుతున్న ఆయన ... వారి కష్టాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో పలు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన జనసేన క్రియాశీలక కార్యకర్తలకు ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నారు. వినుకొండ నియోజకవర్గం బ్రాహ్మణపల్లికి చెందిన గొల్ల గురుబ్రహ్మ ప్రమాదంలో మరణించారు. దీంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించిన నాదెండ్ల రూ.5 లక్షల బీమా చెక్కు అందజేశారు. అలాగే కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం నీలిపూడి గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు బుద్దన పవన్ కుమార్ ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న నాదెండ్ల ఆయన కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షల బీమా చెక్కు అందజేసినట్లు జనసేన పార్టీ వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments