Janasena Party : దసరా నుంచి ఏపీ రాజకీయాల్లో మార్పులు.. పవన్ యాత్రతో ఇకపై సంచలనాలే : నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
వ్యవసాయం కోసం చేసిన అప్పుల భారంతో బలవన్మరణానికి పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో ముందుకు వెళ్తున్నామన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఉమ్మడి కడప జిల్లాకు చెందిన నాయకులు, జన సైనికులతో నాదెండ్ల సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నీతి, నిజాయతీలనే నమ్ముకున్న పార్టీ జనసేన అని స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయడమే కాకుండా భవిష్యత్తులోనూ అండగా నిలుస్తామని భరోసా కల్పిస్తున్నామని నాదెండ్ల వెల్లడించారు.
కడప జిల్లాలో 132 మంది కౌలు రైతులు ఆత్మహత్య:
ఉమ్మడి కడప జిల్లాలో గత మూడేళ్ల కాలంలో 132 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారనీ, వారికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉందనీ పార్టీ శ్రేణులకు నాదెండ్ల దిశానిర్దేశం చేశారు. బెదిరింపులు వచ్చినా, కేసులు పెట్టినా కౌలు రైతు భరోసా యాత్ర ఉమ్మడి కడప జిల్లాలో జరుగుతుందని ఆయన తేల్చిచెప్పారు. జనసేన శ్రేణులన్నీ ఒక్కటై రైతులకు మేమున్నామని అభయం ఇవ్వాల్సిన అవసరం ఉందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జనసేన పార్టీకి కడప జిల్లాలో బలంగా పనిచేసే జన సైనికులున్నారని ఆయన ప్రశంసించారు. ఎన్నో ఒత్తిళ్లు ఉండే ప్రాంతంలో ఓ గొప్ప ఆశయం కోసం మనం పనిచేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని నాదెండ్ల దిశానిర్దేశం చేశారు.
పులివెందులలోనూ కౌలు రైతుల బలవన్మరణాలు:
జనసైనికులకు ఏ కష్టమొచ్చినా పార్టీ కచ్చితంగా అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. గత మూడేళ్లలో సీఎం సొంత జిల్లాలో 132 మంది కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడటం సాధారణ విషయం కాదని నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. సొంత నియోజకవర్గం పులివెందులలోనూ గత మూడేళ్లలో అనేక మంది బలవన్మరణానికి పాల్పడ్డారని.. వారి తగిన సాయం అందించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. కేవలం పార్టీ నుంచి సాయం చేయడమే కాదు.. ప్రభుత్వం నుంచి సదరు కౌలు రైతులకు న్యాయంగా రావల్సిన రూ.7 లక్షలు వచ్చే వరకు జన సైనికులు పోరాడాలని నాదెండ్ల దిశానిర్దేశం చేశారు.
పవన్ యాత్రతో పేదలకు దగ్గరవుదాం:
దసరా నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కనివినీ ఎరుగని మార్పులు ఉంటాయని నాదెండ్ల మనోహర్ జోస్యం చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే యాత్ర రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పబోతోందన్నారు. ఈ యాత్ర ద్వారా కష్టాల్లో ఉన్న పేదలకు మరింత దగ్గరవుదామని ఆయన సూచించారు. 2014 నుంచి రాజకీయాల్లో వెనకడుగు లేకుండా, గొప్ప పట్టుదలను చూపుతూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనే ఓ గొప్ప వేదికను అందించారని నాదెండ్ల మనోహర్ కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దీనిని మరింత బలపర్చాల్సిన అవసరం ప్రతి జన సైనికుడిపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
జగన్‌ని ఓడించడమే మన లక్ష్యం:
ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తున్న జగన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా కంకణం కట్టుకొని పని చేయాలని నాదెండ్ల దిశానిర్దేశం చేశారు. ఈ పోరాటంలో అరెస్టులు, కేసులు, బెదిరింపులు, దాడులు ఉంటాయని... వాటన్నింటినీ దాటుకొని పోరాటం చేయాలన్నారు. కడప జిల్లాలో జనసేన ఎంత బలంగా ఉందో కౌలు రైతు భరోసా యాత్ర ద్వారా చాటి చెబుదామని నాదెండ్ల మనోహర్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారని.. కచ్చితంగా అది రాష్ట్ర ప్రజలకు మేలు చేసేది అయితేనే ఆయన దాన్ని ఆమోదిస్తారని నాదెండ్ల అన్నారు. నాయకుణ్ణి ప్రతి జన సైనికుడు అనుసరించాలని.. మన నాయకుడు చూపిన దారిలో నడవాలని మనోహర్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments