జగన్ మదిలో ముందస్తు ఆలోచన.. కోనసీమలో చిచ్చు వైసీపీ కుట్రే : నాదెండ్ల మనోహర్
Send us your feedback to audioarticles@vaarta.com
ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఈ ప్రభుత్వం ఆరాటపడుతోందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ప్రజాబలం లేక, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచే దారి లేక కులాల మధ్య చిచ్చు పెట్టాలని కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. దీనిలో భాగంగానే కోనసీమ అల్లర్లు జరిగాయని.. ఓ ప్రణాళిక ప్రకారం చేసిన దుశ్చర్యేనని నాదెండ్ల మండిపడ్డారు. ఇంతటి ఘటన జరిగితే కనీసం ముఖ్యమంత్రి నుంచి ఒక ప్రకటన రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. జనసేన పార్టీ కోనసీమ అల్లర్ల విషయంలో బాధ్యతాయుతంగా స్పందించిందని... సంఘటన జరిగిన వెంటనే అక్కడున్న పరిస్థితిని చక్కదిద్దేలా పవన్ మీడియాతో మాట్లాడారని మనోహర్ గుర్తుచేశారు. ప్రశాంతత తీసుకురావడానికి అందరూ సంయమనం పాటించాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.
జనసేన ఎదుగుదలను తట్టుకోలేకే కోనసీమ అల్లర్లు:
కోనసీమతోపాటు తూర్పుగోదావరి జిల్లాలో రోజు రోజుకీ బలపడుతున్న జనసేన పార్టీ ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఈ ప్రభుత్వం చేసిన కుట్ర కోనసీమ అల్లర్లని నాదెండ్ల ఆరోపించారు. ప్రజలు సైతం ఇదే అర్థం చేసుకుంటున్నారని... ప్రభుత్వ కుట్రలను ప్రజలే తిప్పికొడుతున్నారని దుయ్యబట్టారు. అధికార పార్టీకి చెందిన శాసనమండలి సభ్యుడు అనంతబాబుపై పడిన హత్య కేసు మరకను తప్పించేందుకు, ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు వైసీపీ చేసిన అత్యంత దారుణమైన కుట్ర కోనసీమ అల్లర్లని మనోహర్ ఆరోపించారు. దీనివల్ల సామాన్యులు బాధపడుతున్నారని.. విద్యార్థులు, ఉద్యోగస్తులకు ఇంటర్ నెట్ రాక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంత ప్రయత్నించినా డీజీపీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు:
కోనసీమ అల్లర్ల ఘటనలో నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. రాజకీయంగా కొందర్ని ఎంచుకొని వేధించాలనే తలంపుతో అమాయకులపై పోలీసు కేసులు పెడితే కచ్చితంగా జనసేన లీగల్ విభాగం పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ర్టంలో శాంతి భద్రతలు, కోనసీమ అల్లర్ల విషయాన్ని మాట్లాడేందుకు డీజీపీని అపాయింట్మెంట్ కోరామని... కనీసం ఆయన నుంచి స్పందన లేదని మనోహర్ దుయ్యబట్టారు. ఒక పార్టీ అధ్యక్షుడు డీజీపీని కలిస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి మంచి అధికారి అని పేరుందని.. మరి ఆయనను నియంత్రిస్తుంది ఎవరన్న దానిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. ఉదయమే దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి లేఖ రాశామని మనోహర్ తెలిపారు.
రెండున్నరేళ్లు విమర్శలు వద్దనుకున్నాం.. జగన్ అంత టైమిస్తేగా : నాదెండ్ల మనోహర్
నాయకులు ఊరికే అయిపోరు.. దానికి ఒక విజన్, పట్టుదల, ఓపికతోపాటు మానవత్వం, ఉన్నతంగా ఆలోచించే హృదయం ఉండాలన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. అవన్నీ ఉన్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఆయన ప్రశంసించారు. మంగళగిరిలో జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. చిత్తశుద్ధిగల నాయకుల్ని తయారు చేసే గొప్ప వేదిక జనసేన పార్టీ అని వ్యాఖ్యానించారు.
జగన్‌కి రెండున్నరేళ్లు సమయం ఇద్దామనుకున్నాం:
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరవాత రెండున్నరేళ్లు ఎలాంటి విమర్శలు చేయకూడదు అని మొదట అనుకున్నామని.. కానీ ఈ ప్రభుత్వం అంతటి సమయం ఇవ్వలేదని నాదెండ్ల దుయ్యబట్టారు. కేవలం 6 నెలల్లోనే ఒకవైపు భవన నిర్మాణ కార్మికుల ఆకలి కేకలు, మరోవైపు ప్రజల సమస్యలు చుట్టు ముట్టాయని ఆయన గుర్తుచేశారు. ఈ సమయంలో ప్రభుత్వంతో పోరాడాలని, ప్రజాపక్షం తీసుకోవాలని నిర్ణయించామని నాదెండ్ల వెల్లడించారు. వైసీపీని నమ్మి 151 మంది శాసన సభ్యులను గెలిపిస్తే , ప్రజల నమ్మకాన్ని వొమ్ము చేయడానికి ఈ ప్రభుత్వానికి ఎంతో సమయం పట్టలేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యల మీద జనసేన చేసిన పోరాటాలకు ప్రజల మద్దతు లభించిందని... వారి ఆవేదనను జనసేన పార్టీ బలంగా ముందుకు తీసుకెళ్తుందన్న నమ్మకం కలిగిందన్నారు.
పవన్ మథనంలోంచి పుట్టిందే కౌలు రైతు భరోసా యాత్ర:
ఏప్రిల్ 5న జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో రైతుల సమస్యల మీద చర్చపెట్టామని నాదెండ్ల గుర్తుచేశారు. అప్పుడు కౌలు రైతుల ఆత్మహత్యల మీద మాట్లాడుకున్నామని.. దీనిపై పూర్తిస్థాయిలో స్పందించి, చలించింది మాత్రం పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ఆయన ఆలోచనలు, ఎలా సాయపడాలి అనే మథనం నుంచి వచ్చిన కార్యక్రమమే జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర అని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇప్పటికే మూడు జిల్లాల్లో మొదటి విడత పూర్తి చేసుకున్నామని... తరువాత ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com