Download App

Naandhi Review

అల్ల‌రి నరేష్ .. ఈ పేరు విన‌గానే మ‌న‌కు ఆయ‌న న‌టించిన కామెడీ సినిమాలే గుర్తుకు వ‌స్తాయి. ఇప్పుడు విడుద‌లైన నాంది న‌రేష్ 57వ సినిమా. ఇందులో చాలా త‌క్కువ సినిమాలే విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు చేసిన సినిమాలు. ఎక్కువ‌గా కామెడీ స్టార్‌గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించే ప్ర‌య‌త్నం చేశాడు న‌రేష్‌. ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించే సినిమాలే చేసినా కూడా విశాఖ ఎక్స్‌ప్రెస్‌, గ‌మ్యం, ల‌డ్డుబాబు, మ‌హ‌ర్షి ఇలా మ‌ధ్య మ‌ధ్య‌లో డిఫరెంట్ సినిమాలు చేసిన నరేష్ , మరోసారి నాంది వంటి డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు. న్యూడ్‌గా క‌నిపించే న‌రేష్ పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాలో న‌రేష్ ఏదో కొత్త ప్ర‌య‌త్నం చేశాడ‌నిపించాయి. మ‌రి నాంది నిజంగానే కొత్త ప్ర‌య‌త్న‌మా?  చాలా రోజులుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న న‌రేష్‌కు నాంది చిత్రం స‌క్సెస్‌ను అందించిందా?  అనే వివ‌రాలు తెలియాలంటే సినిమా క‌థలోకి వెళ‌దాం...

క‌థ‌:

బండి సూర్య ప్ర‌కాష్‌(అల్ల‌రి న‌రేర‌ష్‌) చంచ‌ల్ గూడ జైలులో ఐదేళ్ల నుంచి అండ‌ర్ ట్రైల్ ఖైదీగా శిక్ష‌ను అనుభ‌విస్తూ ఉంటాడు. అదే జైలులోకి పిట్టి కేసులో లోప‌లికి వ‌చ్చిన మ‌రో ఖైది(ప్రియ‌దర్శి)కి కొన్ని ప‌రిస్థితుల్లో త‌న క‌థ‌ను చెబుతాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సూర్య మంచి యువ‌కుడు. త‌ల్లిదండ్రుల‌తో సంతోషంగా జీవితం గ‌డుపుతుంటాడు. మీనాక్షి(న‌వ‌మి)తో పెళ్లి కూడా కుదురుతుంది. అంత స‌వ్యంగా సాగుతుంద‌ని అంద‌రూ అనుకుంటున్న స‌మ‌యంలో పౌర హ‌క్కుల నేత రాజ‌గోపాల్‌ను ఎవ‌రో హ‌త్య చేస్తారు. కేసుని  హ్యాండిల్ చేస్తున్న సీఐ కిషోర్‌(హ‌రీష్ ఉత్త‌మ‌న్‌) సూర్య‌ను దోషిగా అరెస్ట్ చేసి జైలుకు పంపుతాడు. అండ‌ర్ ట్రైల్ ఖైదీగా జైలులోకి వ‌చ్చిన సూర్య‌నే దోషిగా నిరూపించేలా కొన్ని ఘ‌ట‌న‌లు జ‌రిగి అత‌నికి శిక్ష పొడిగిస్తూనే ఉంటారు. ఆ స‌మ‌యంలో లాయ‌ర్ ఆద్య‌(వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌) కేసుని టేక‌ప్ చేసి సూర్య అకార‌ణంగా జైలులో ఉన్నాడ‌ని అత‌ను దోషి కాడ‌ని, పోలీసులు అత‌న్ని కేసులో ఇరికించార‌ని కోర్టులో ఆద్య నిరూపించ‌డంతో నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌స్తాడు సూర్య‌. త‌ర్వాత త‌న‌ను కేసులో అన్యాయంగా పోలీసులు ఇరికించార‌ని చెబుతూ కిషోర్‌పై కేసు వేస్తాడు. ఇంత‌కీ సూర్య‌ను పోలీసులు కేసులో ఎందుకు ఇరికిస్తారు? అస‌లు రాజ‌గోపాల్ హత్య వెనుక సూత్రధారి ఎవరు?  కేసుని ఆద్య ఎందుకు టేక‌ప్ చేస్తుంది?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: 

సామాన్యుడిని తప్పుడు కేసులో ఇరికించే పోలీసులు ఉంటే... వాళ్లమీద మళ్లీ కేసులు పెట్టొచ్చని ఎంతమందికి తెలుసు! నిరపరాధికి ఎంత శిక్ష పడిందో, అంత శిక్షను ఆ పోలీసుకు విధిస్తారనే విషయం మీద ఎందరికి అవగాహన ఉంది? ఇలాంటి రేర్‌ పాయింట్‌తో తెరకెక్కిన మూవీ నాంది. ఈవీవీ ఉన్నన్ని రోజులు ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో కితకితలు పెట్టిన అల్లరి నరేష్‌కి, ఒక రకంగా కమ్‌ బ్యాక్‌ మూవీ నాంది. ఆయన కూడా అంతే ఇంట్రస్ట్ తో చేసినట్టు అనిపిస్తుంది.  ఓ అండర్‌ ట్రయల్‌ ఖైదీ గురించిన కథ. ఎలాంటి నేరమూ చేయకుండా ఐదేళ్లు జైలులో కూర్చున్న ఓ వ్యక్తి, తన కుటుంబానికి, ప్రేమించిన అమ్మాయికి ఎలా దూరమయ్యాడు? అతన్ని బయటకు తీసుకురావడానికి అప్పుడే డిగ్రీ తీసుకున్న ఓ లాయర్‌ ఎలాంటి ప్రయత్నం చేసింది? ఐపీసీ 211 గురించి అతనికి ఆమె ఏం నేర్పింది? ఇలాంటి కథతో సాగుతుంది సినిమా. గడ్డం లుక్లో ఉన్న నరేష్‌ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. వెంటనే మహేష్‌ మూవీ మహర్షి గుర్తుకొస్తుంది. ఈ సినిమాలో న్యూడ్‌గానూ యాక్ట్ చేశారు నరేష్‌. అయితే ఆ సీన్‌ లేకపోయినా పెద్దగా వచ్చిన ఇబ్బందేమీ లేదు. పెట్టినందుకు ఆ సీన్‌లో అంత ఇంటెన్సూ కనిపించదు. అదే షాట్‌ని ప్రియదర్శి మీద తర్వాత కామెడీగా చూపించడంతో, ముందు షాట్‌కి ఆ ఇంటెన్స్ పోయిందేమో. ఓ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం జరిగిన ఓ హత్య, దానికి కారణం ఓ హోమ్‌ మినిస్టర్‌. ఆ కేసులో అమాయకుడిని ఇరికించిన పోలీస్‌, నిరపరాధిని కాపాడిన లాయర్‌... సినిమా లైన్‌ ఇదే. ఎక్కడా పెద్దగా కామెడీ ఉండదు. రిలీఫ్‌ పాయింట్స్ ఉండవు. కాకపోతే ఇష్యూని సీరియస్‌గా డీల్‌  చేసిన విధానం బావుంటుంది. దర్శకుడు విజయ్ సినిమాను డీవియేట్ చేయాలనే కోణంలో సినిమాను తెరకెక్కించలేదనే విషయం స్పష్టమైంది. శ్రీచరణ్ పాకాల నేపథ్యం సంగీతం, సిద్ సినిమాటోగ్రఫీ కూడా బావున్నాయి. కొన్ని సిట్యువేషన్స్‌లో డైలాగ్స్ ఆక‌ట్టుకుంటాయి. ఓ చిన్న పొరపాటు ఓ కుటుంబాన్ని ఎలా అంతం చేస్తుందో అర్థమయ్యేలా చూపించారు. ఇలాంటి కథలు పొరుగు భాషల్లో విడుదలై, తెలుగులో అనువాదమైతే చూస్తారేమో కానీ, మన తెలుగు స్క్రీన్‌ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయన్నది ఆలోచించాల్సిన విషయమే.

నరేష్‌ నటన బావుంది. కెమెరా, స్క్రీన్‌ప్లే బావున్నాయి. వరలక్ష్మి నటన ప్లస్‌ పాయింట్‌ అవుతుంది. కాకపోతే ఒక జోనర్‌ ఆడియన్స్ కి మాత్రమే పరిమితమైనట్టు అనిపిస్తుంది నాంది.

బోట‌మ్ లైన్‌:  నాంది.. న‌రేష్ కొత్త ప్ర‌య‌త్నం

Rating : 2.8 / 5.0