బయట తెలియని కొన్ని వాస్తవాలతో ‘నాలో.. నాతో.. వైఎస్సార్’: విజయమ్మ
- IndiaGlitz, [Wednesday,July 08 2020]
మాజీ ముఖ్యమంత్రి.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మ.. ఓ పుస్తకం రాశారు. తన భర్త జీవితం గురించి బయటకు తెలియని ఎన్నో విషయాలను ఆమె ఆ పుస్తకంలో వివరించారు. ఆ పుస్తకానికి ఆమె ‘నాలో.. నాతో.. వైఎస్ఆర్’ అనే టైటిల్ ఇచ్చారు. వైఎస్‌తో గడిపిన జీవితం.. ఆయన మరణానంతర పరిస్థితులను ఆ పుస్తకంలో ఆమె చక్కగా పొందుపరిచారు. నేడు వైఎస్ఆర్ 71వ జయంతి సందర్భంగా ఈ పుస్తకం విడుదల కానుంది. ఆమె రాసిన ఆ పుస్తకాన్ని వారి కుమారుడు, ఏపీ సీఎం జగన్ విడుదల చేయనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి భార్య రాసిన పుస్తకాన్ని ఒక ముఖ్యమంత్రిగా వారి కుమారుడే విడుదల చేయడం చాలా అరుదు. ఆ పుస్తకంలో తాను బయటి ప్రపంచానికి తెలియని ఒక గొప్ప నాయకుడి గురించి కొన్ని వాస్తవాలను రాశానని విజయమ్మ పేర్కొన్నారు. చిన్న వయసులోనే వివాహం నుంచి లెజెండరీ లీడర్ జీవితం.. అప్పటి పరిస్థితులు.. పేదవాడి వైద్యుడిగా పేరు సంపాదించడం.. రాజకీయాల్లోకి ప్రవేశించడం.. ఆయన ఎదుర్కొన్న ఒత్తిళ్లు.. తదితర విషయాలన్నింటి నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వరకూ విజయమ్మ ఆ పుస్తకంలో వివరించారు. ఈ పుస్తకాన్ని ఎమెస్కో ప్రచురించింది.