ఏప్రిల్ 22న మిలట్రీ మాధవరంలో 'నా పేరు సూర్య' ఆడియో రిలీజ్

  • IndiaGlitz, [Monday,April 16 2018]

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో  తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు  సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు

ఏప్రిల్‌ 22న మిలట్రీ మాధవరంలో ఆడియో ఫంక్షన్ చేయబోతున్నారు. మే 4 న సినిమా ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..... మిలట్రీ మాధవరం...ఈ ఊరు పేరు తెలియని దేశభక్తులుండరేమో. ఈ ఊరి నుంచి గడపకొక్కడు భారతదేశ సరిహద్దుల్లో కాపు గాస్తూ... మనందరి యోగ క్షేమాల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలానికి చెందిన గ్రామం మాధవరం. బ్రిటీష్ పాలనలోనే ఈ గ్రామం నుంచి అనేక మంది యువత సైన్యంలో ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. అందులో కొందరు అమరులయ్యారు.

ఈ గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా సైన్యంలో ఉంటారంటే అతిశయోక్తి కాదు. అందుకే మిలట్రీ మాధవరం పేరు సార్థకనామధేయంగా మిగిలింది. అలాంటి వీర సైనికుల నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. పవర్ ఫుల్ యాక్షన్ ఎమోషనల్ చిత్రంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ సైనికుడి పాత్ర కోసం ప్రత్యేకంగా తనను తాను మలచుకున్న విధానం ఔరా అనిపిస్తుంది. ఎందరో అమర వీరుల్ని తలచుకుంటూనే... ప్రతీ క్షణం మన రక్షణ కోసం... ప్రతీ ఇంటి నుంచి ఓ వీర సైనికుడిని దేశం కోసం త్యాగం చేసిన కుటుంబాల్ని ప్రత్యక్షంగా కలుసుకునేందుకు నా పేరు సూర్య చిత్రం ఆడియో ఫంక్షన్ మిలట్రీ మాధవరంలో చేయాలని నిర్ణయించాం.

ఈనెల 22న ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సైనికుల త్యాగాల్ని మరోసారి గుర్తు చేసుకునేలా... వారిని గౌరవించుకునేలా... ఈ కార్యక్రమం ఉండబోతుంది. అల్లు అర్జున్ తో పాటు చిత్ర యూనిట్ అంతా ఈ ఆడ‌యో ఫంక్షన్ లో పాల్గొనబోతున్నారు. ఈ ఊరు గురించి తెలుసుకున్న వెంట‌నే మా యూనిట్ అక్క‌డికి వెళ్ళి అక్క‌డ ప్ర‌జ‌ల్ని క‌ల‌వ‌టం జ‌రిగింది. ఆ ఊరు గొప్ప‌ద‌నాన్ని మా యూనిట్ ద్వారా విన్నాము. మ‌నం దేశం భ‌క్తి నేప‌ధ్యంలో తీస్తున్న ఈ చిత్రం కాబ‌ట్టి ఒక్క‌సారి అక్క‌డికి వెళ్ళి రావాల‌ని అంద‌రం అనుకున్నాం. మా హీరో అల్లు అర్జున్ ని చెప్ప‌గానే ఎంతో ఆనందంగా నేను వ‌స్తాను అన‌టం విశేషం. అక్క‌డ కొన్ని కుటుంబాల్నిబ‌న్ని క‌లుసుకుంటారు. వారి స‌మ‌క్షంలొనే ఆడియో ని చెయ్య‌ల‌ని నిర్ణ‌యించుకున్నాము.   అని అన్నారు.