Mystery:మిస్టరీగా అవనిగడ్డ ‘‘కారు’’ కేసు : ముదినేపల్లికి వెళ్లాల్సిన వ్యక్తి.. చోడవరం ఎందుకు, ఆ అర్ధరాత్రి ఏం జరిగింది..?
Send us your feedback to audioarticles@vaarta.com
కృష్ణా జిల్లా చోడవరం వద్ద కరకట్ట కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. పోలీసులు గంటల పాటు శ్రమించి కారును వెలికి తీయగా.. దాదాపు 36 గంటల తర్వాత అక్కడికి దగ్గరలోనే గాజుల రత్నభాస్కర్ (47) అనే వ్యక్తి మృతదేహం దొరికింది. అయితే ఈ కేసు పెద్ద మిస్టరీగా మారింది. ముదినేపల్లికి వెళ్లాల్సిన కారు.. చోడవరం వైపు వెళ్లడం, భాస్కర్ శవమై తేలడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వీటన్నింటిలోకి ఆయన వెంట తీసుకెళ్లిన డబ్బులు కనిపించకపోవడం మరింత అలజడి రేపుతోంది. దీంతో కేసును ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది. మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడం, ఏ క్లూ దొరక్కపోవడంతో అతను ఎలా చనిపోయాడు అన్నదానిని తేల్చడం కష్టంగా మారింది. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
రత్నభాస్కర్ ఇంటి నుంచి బయల్దేరిన రోజు అర్ధరాత్రి ఏం జరిగింది అన్నది తెలిస్తే.. కేసు మిస్టరీని విప్పొచ్చని పోలీసులు భావిస్తున్నారు. రూ.4 లక్షలు తీసుకుని రత్న భాస్కర్ బయల్దేరారు. ఆ సొమ్ము ఇప్పుడు మాయం కావడంతో దొంగలు ఏమైనా చంపారా..ఆర్ధిక లావాదేవీలు , శత్రువుల పనా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. రత్నభాస్కర్ ఇంటి దగ్గరి నుంచి కారు కెనాల్లో పడిన వరకు వున్న రహదారులపై సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు చోట్ల రత్న భాస్కర్ కారులో ఒంటరిగానే వున్నట్లు కనిపించిందని సమాచారం. పోస్ట్‌మార్టం నివేదిక వస్తే కానీ పోలీసులకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
అసలేం జరిగిందంటే:
కృష్ణా జిల్లా ముదినేపల్లికి చెందిన గాజుల రత్నభాస్కర్.. ఐస్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆయన గత ఆదివారం మచిలీపట్నంలో నిర్వహించిన టీడీపీ సమావేశానికి వెళ్లాడు. మీటింగ్ పూర్తయ్యాక ముదినేపల్లిలోని ఇంటికి వెళ్లాల్సి వుండగా.. చోడవరం ఎందుకు వెళ్లాడు, అక్కడ ఏం జరిగింది, ఆయనను ఎవరైనా చంపారా, లేక ప్రమాదవశాత్తూ కారు కెనాల్లోకి దూసుకెళ్లిందా అన్నది అంతు చిక్కడం లేదు. కారులో వున్న రత్న భాస్కర్ దుస్తులు, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments