నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు.. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు: ఉత్తమ్

  • IndiaGlitz, [Monday,April 01 2024]

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాప్ చేసిందని అప్పటి ప్రతిపక్ష నేతలు ఫిర్యాదులుచేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తమ ఫోన్లు ట్యాప్ చేశారని డీజీపీకి ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తన ఫోన్ 100శాతం ట్యాప్ చేశారని తెలిపారు. ఈ కేసు చాలా సీరియస్‌గా ఉంటుందని.. పెద్ద తలకాయలు జైలుకు వెళ్లే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చార.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసులను విచ్చలవిడిగా కేసీఆర్ వాడుకున్నారని మండిపడ్డారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు పోలీసులు న్యూట్రల్‌గా ఉండాలని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఎన్నికల డబ్బులు పంపిణీ సహా అనేక రకాలుగా పోలీసులను కేసీఆర్ వాడుకున్నారని... ఈ రకంగా పోలీసులను దేశంలో ఏ ముఖ్యమంత్రి వాడుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూతురు లిక్కర్ కేసులో ఇరుక్కుపోయింది. గొర్రెల స్కాంలో ఇంకొందరు ఇరుక్కుపోయారు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాము ఎక్కడ ఇరుక్కుంటామనే భయం బీఆర్ఎస్ నేతలకు పట్టుకుందన్నారు.

అలాగే కేసీఆర్‌ జిల్లాల పర్యటనపైనా ఉత్తమ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ డిప్రెషన్‌, ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని అందుకే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జాతీయ పార్టీగా చెప్పుకున్న ఏ పార్టీ కూడా ఇంత త్వరగా కుప్పకూలలేదని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మిగలదని.. కేసీఆర్‌ కుటుంబసభ్యులు తప్ప అందులో ఎవరూ ఉండరని జోస్యం చెప్పారు. కేసీఆర్‌లా తమకు ఫామ్ హౌస్‌లో పడుకునే అలవాటు లేదని, ప్రతీరోజూ సచివాలయానికి వస్తున్నామని చెప్పారు. ప్రతి సమస్యపై వారం పదిరోజులకు ఒకసారి రివ్యూ చేస్తున్నామని ఉత్తమ్ వెల్లడించారు.

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పంట నష్టం జరిగితే రైతులకు బీమా పరిహారం ఇవ్వలేదన్నారు. కమీషన్ల కోసం ప్లాన్‌, డిజైన్లు లేకుండా ప్రాజెక్టులు నిర్మించారని.. కాళేశ్వరంపై మాట్లాడేందుకు సిగ్గుపడాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.40వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారని విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దుబారా ఖర్చులు చేశారని ఫైర్ అయ్యారు. ఇక నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావని.. మొత్తం 14 ఎంపీ సీట్లు తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.