Allu Arjun:నా ప్రేమ, మద్దతు పవన్ కల్యాణ్‌కే.. అల్లు అర్జున్ ట్వీట్..

  • IndiaGlitz, [Thursday,May 09 2024]

ఏపీ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్‌ పిఠాపునం నియోజకవర్గం వైపే అందరి చూపు ఉంది. అక్కడ పవన్‌ను ఓడించాలని వైసీపీ నేతలు ఎత్తులు వేస్తుంటే.. ఎలాగైనా గెలిచి తీరాలని జనసేన నేతలు పైఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఒక్కొక్కరుగా పవన్‌ కళ్యాణ్‌ గెలుపు కోసం మద్దతు ఇస్తున్నారు.

ఇప్పటికే పృథ్వీరాజ్, జానీ మాస్టర్, హైపర్‌ ఆది, సుడిగాలి సుధీర్‌, రాంప్రసాద్‌తో పాటు పలువురు జబర్దస్ట్‌ ఆర్టిస్ట్‌లు పవన్ తరుపున ప్రచారం చేస్తున్నారు. అలాగే మెగా ఫ్యామిలీ మొత్తం పవన్‌కు మద్దతు తెలిపింది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడికి మద్దతుగా ఓ వీడియో విడుదల చేయగా.. రామ్‌చరణ్ కూడా అందుకు మద్దతు తెలిపారు. ఇక వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు.

ప్రియమైన పవన్‌ కల్యాణ్‌ గారి ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తు్న్నాను. మీరు ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తున్నాను. ఒక కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ, మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి. మీ ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

ఇక మెగా ఫ్యామిలీతో పాటు ఇతర హీరోలు కూడా పవన్ కల్యాణ్‌కు తమ మద్దతు తెలియజేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. సినీ కుటుంబంలో ఒకడిగా జనసేనానికి మద్దతు పలుకుతున్నట్లు వివరించారు. 'ఈ ఎన్నికల పోరాటంలో మీరు గెలవాలి.. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలి. ఆల్ ది వెరీ బెస్ట్ సర్’ అంటూ నాని ట్వీట్ చేశారు.

అలాగే మరో యువ హీరో రాజ్‌ తరుణ్‌ కూడా ‘ఆంధ్రప్రదేశ్‌ శ్రేయస్సు కోసం మీ కృషిని, ప్రయత్నాలను మొదటి రోజు నుంచి చూస్తున్నాను. కోట్ల మందికి మీరు ఒక ఆశ. మీరు గెలిచి ప్రజల తలరాతలను మార్చాలని కోరుకుంటున్నాను. ఇప్పటి జనాలకు మీరు కావాలి’ అని ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు. 'త్వరలోనే మన అందరికీ ఓ బిగ్ డే రాబోతోంది.. పవన్ కళ్యాణ్ సర్ మమ్మల్ని గర్వపడేలా చేయండి అంటూ హనుమాన్ హీరో తేజ సజ్జా ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. వీరితో పాటు మరికొంతమంది నిర్మాతలు, నటులు కూడా పవన్‌కు తమ మద్దతు తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం పవన్ కల్యాణ్‌తో పాటు కూటమికి పూర్తి స్థాయి మద్దతు తెలియజేస్తుంది