'ఎంత మంచివాడవురా'తో నా కోరిక తీరింది - యంగ్ టైగర్ ఎన్టీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి కల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `ఎంత మంచివాడవురా`. 'శతమానం భవతి' చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యు సర్టిఫికేట్‌ను పొందింది. సంక్రాంతి సందర్భంగా సినిమాను జనవరి 15న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో థియేట్రికల్ ట్రైలర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు.
ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు మాట్లాడుతూ - "ఎంత మంచివాడవురా` మంచి కుటుంబ కథా చిత్రం. ఈ సంక్రాంతికి అందరికీ బావుండాలని కోరుకుంటున్నాను" అన్నారు.
టి.ఎన్.ఆర్ మాట్లాడుతూ - ``తొలిసారి నాకు పూర్తినెగిటివ్ రోల్ ఇచ్చిన డైరెక్టర్ సతీశ్ వేగేశ్న గారికి థ్యాంక్స్`` అన్నారు.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ - ``డైరెక్టర్ సతీశ్ వేగేశ్నగారు నన్ను కొత్త కోణంలో చూపించబోతున్నారు. ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి చేస్తోన్న తొలి చిత్రమిది. కల్యాణ్‌రామ్‌గారికి కూడా థ్యాంక్స్. సినిమాలో గొప్ప నటీనటులు ఉన్నారు. అందరూ అద్భుతంగా నటించారు. వీరితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ నెల 15న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
నటాషా దోషి మాట్లాడుతూ - ``జైసింహలో బాలకృష్ణగారితో నటించాను. ఇప్పుడు కల్యాణ్‌రామ్‌గారితో ఈ సినిమాలో చేయడం హ్యాపీగా ఉంది. సంక్రాంతికి విడుదలవుతోన్న ఈసినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
శరత్ బాబు మాట్లాడుతూ - ``ఎంతమంచివాడవురా` సినిమా సంక్రాంతికి వచ్చి షడ్రసోపేతమైన విందును అందించబోతుంది. ప్రేక్షకులు ఈ సినిమా పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ - ``ప్రేక్షకుల కేరింతలు ఈ పండగకి నాలుగింతలు కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
ఆదిత్య మ్యూజిక్ అధినేతలు, నిర్మాతలు ఉమేష్ గుప్త,సుభాష్ గుప్త మాట్లాడుతూ - ``మా బ్యానర్‌లో చేస్తోన్న తొలి సినిమాను నందమూరి కల్యాణ్‌గారితో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. గోపీసుందర్‌గారు, డైరెక్టర్ సతీశ్‌గారు సహా ఎంటైర్ టీమ్ చాలా డేడికేషన్‌తో పనిచేశారు. సినిమా బాగా వచ్చింది. హార్ట్ టచింగ్, ఫీల్ గుడ్ మూవీ. తప్పకుండా ఈ నెల 15న విడుదలవుతున్న ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఎంటైర్ యూనిట్‌కి థ్యాంక్స్`` అన్నారు.
ఆదిత్య మాట్లాడుతూ - ``మా కుటుంబం ప్రొడ్యూస్ చేస్తున్న తొలి చిత్రం. ప్రేక్షకులు ఇంతకు ముందు మమ్మల్ని ఆదరించినట్లుగానే ఇప్పుడు కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ మాట్లాడుతూ - ``ఆదిత్య నిర్మాణ సంస్థతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. పాటలన్నీ చక్కగా కుదిరాయి. ప్రేక్షకులు ఆదరించారు. రేపు సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. కుటుంబ కథా చిత్రం. సపోర్ట్ చేసిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్`` అన్నారు.
చిత్ర సమర్పకులు శ్రీదేవి మూవీస్ అధినేత శివ లెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ - ``నందమూరి హీరోలు క్రమశిక్షణకు పెట్టింది. బాలకృష్ణగారితో నేను నాలుగు సినిమాలు చేశాను. అంతే పట్టుదలతో ఉంటారు. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌గారికి సినిమాలంటే ఎంతో ప్యాషన్. ఎంత మంచివాడవురా పండగ సినిమా. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు`` అన్నారు.
చిత్ర దర్శకుడు సతీశ్ వేగేశ్న మాట్లాడుతూ - ``నా తల్లిదండ్రులకు, నన్ను రైటర్‌ని చేసిన ముప్పలనేని శివగారికి, నన్ను డైరెక్టర్‌ని చేసిన ఈవీవీగారికి, అల్లరి నరేశ్‌గారికి, నాకు శతమానం భవతితో పునర్జన్మను ఇచ్చిన దిల్‌రాజుగారికి థ్యాంక్స్. 1963లో సీనియర్ ఎన్టీఆర్‌కి మా నాన్నగారు పెద్ద అభిమాని, అఖిల భారత ఎన్టీఆర్ సంఘానికి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఒక మనిషికి ఆనందం, బాధ ఒకేసారి రాదు. చాలా అరుదు. నేను అభిమానించే తారక్, నాతో సినిమా చేసిన కల్యాణ్‌రామ్‌ను చూసి ఆనందపడాలో.. మా నాన్నగారు ఈరోజు లేరని బాధపడాలో తెలియడం లేదు. `ఎంత మంచివాడవురా` సినిమా ఎన్టీఆర్ మాస్ చేస్తే సింహాద్రి.. క్లాస్ చేస్తే బృందావనం.. క్లాస్, మాస్ మిక్స్ చేస్తే ఒక అరవింద సమేత, ఒక జనతాగ్యారేజ్. అలాగే నందమూరి కల్యాణ్‌రామ్‌గారు మాస్ చేస్తే అతనొక్కడే, క్లాస్ చేస్తే 118, క్లాసు, మాసు కలిపి చేస్తే `ఎంతమంచివాడవురా`. సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థ్యాంక్స్. ఈ సినిమాను 72 రోజుల్లో పూర్తి చేయడానికి కారణమైన నా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్. ప్రతి ఒక్కరూ రక్తం చిందించి(జలగల మధ్య) సినిమాను పూర్తి చేశాం. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాం`` అన్నారు.
మెహరీన్ మాట్లాడుతూ - ``నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన కల్యాణ్‌రామ్‌గారికి, దర్శకుడు సతీశ్‌గారికి, నిర్మాతలు ఉమేష్‌గుప్త, సుభాష్ గుప్త, కృష్ణ ప్రసాద్‌గారికి థ్యాంక్స్. టైటిల్ మాత్రమే కాదు.. మా ఎంటైర్ యూనిట్ అందరూ మంచివాళ్లే. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది`` అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ - ``సంక్రాంతి సినిమాల పోటీలో నందమూరి సినిమా కూడా నిలబడింది. ఉమేష్ గుప్తా నాకు 20 ఏళ్లుగా మిత్రుడు. ఆయనకు ఈ సినిమాకు పెద్దగా హిట్ కావాలి. కల్యాణ్‌రామ్‌గారి పటాస్, 118 తర్వాత ఈ సినిమా మా ఆధ్వరంలో వస్తోంది. పెద్ద హిట్ కావాలి`` అని అన్నారు.
ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల చేశారు. అనంతరం
కల్యాణ్ రామ్ మాట్లాడుతూ - ``ఆదిత్య మ్యూజిక్ వారికి మొదటి సారి ప్రొడక్షన్‌కి వచ్చినందుకు ఆహ్వానం పలుకుతున్నాం. జనవరి 15న మన సినిమా వస్తోంది. చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నా. సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. 9న దర్బార్, 11న మా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు వస్తోంది. థాంక్స్ బన్నీ అండ్ త్రివిక్రమ్‌గారూ... వాళ్ల సినిమా 12న వస్తోంది. మా సినిమా 15న వస్తోంది. చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా`` అని చెప్పారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ - ``బ్రదర్స్ సైలెంట్‌గా ఉంటే మాట్లాడతా. లేకుంటే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను. ఇక్కడికి అభిమానులు, శ్రేయోభిలాషులు వచ్చారు. వారందరితో పాటు నేను కూడా వచ్చినందుకు ఆనందంగా ఉంది. కల్యాణ్ అన్న ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేశారు. థ్రిల్లర్లు చేశారు. కమర్షియల్ మాస్ పంథా సినిమాలు చేశారు. అయితే ఆయన పట్ల నాకు ఒక వెలితి ఉండేది. కల్యాణ్ అన్న మంచి కుటుంబ సినిమా చేస్తే చూడాలని ఉండేది. ఈ సినిమాతో మా దర్శకుడు సతీష్ వేగేశ్న దాన్ని పూర్తి చేశారు. నిర్మాత కృష్ణప్రసాద్‌గారు మా కుటుంబానికి శ్రేయోభిలాషి. మా కుటుంబసభ్యుడు. బాబాయ్‌తో ఎన్నో సినిమాలు చేశారాయన. అతిపెద్ద మ్యూజిక్ సంస్థ ఆదిత్య ఉమేష్ గుప్తాగారు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. వారిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమా చాలా పెద్దగా ఆడాలి. గోపీసుందర్‌గారు మ్యూజిక్ ఇచ్చారు. వీరందరి కాంబినేషన్‌లో ఎంత మంచివాడవురా జనవరి 15న అందరి ముందుకు రానుంది. మంచి మనసుతో, మంచి చిత్రాన్ని ఆదరించే గొప్ప గుణం అందరిలో ఉంది. తెలుగు ప్రేక్షకదేవుళ్లలో ఉంది. ఎంత మంచి వాడవురా టీమ్‌కి అందరూ సహాయసహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను. అభిమానుల అందరి ప్రాణం తల్లిదండ్రులకు, అన్నచెల్లెళ్లకు, ఆ తర్వాత నాకు, కల్యాణ్ అన్నకి, మా కుటుంబానికి ఎంతో అవసరం. అభిమానుల ఇంటిల్లిపాదీ ఆనందంగా ఉండాలి. అందరికీ నూతన్య సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండగ వాతావరణంలో విడుదలవుతున్న దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురం, ఎంత మంచి వాడవురా... పెద్ద హిట్ కావాలి. ఈ చిత్రాల విజయం తెలుగు చిత్ర సీమ ముందుకు వెళ్లేలా దోహదపడాలని కోరుకుంటున్నా`` అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments