గోల్కొండ కోటతో నాకు ఉన్న అనుబంధం అమోఘం: చిరంజీవి
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచ దేశాలు భారతదేశ చలనచిత్రం వైపు చూస్తోందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. విజయేంద్రప్రసాద్,రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. హైదరాబాద్‌లోని గోల్కొండ కోట చరిత్ర తెలిసేలా కేంద్ర ప్రభుత్వం సౌండ్ అండ్ లైట్ షోను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించగా.. కేంద్ర పర్యాటకశాఖ మాజీ మంత్రి చిరంజీవి, ఎంపీ-రచయిత విజయేంద్రప్రసాద్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ జై శ్రీరామ్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయోధ్యకు వెళ్లడం చాలా ఆనందంగా ఉందని, ఇది తనకు భగవంతుడు కల్పించిన అదృష్టమని పేర్కొన్నారు. గోల్కొండ కోటలో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందన్నారు. గతంలో గోల్కొండలో హీరోయిన్లతో కలిసి డ్యాన్స్ చేసిన సందర్భాలు, అలాగే పోరాట సన్నివేశాలు గుర్తొస్తున్నాయని చెప్పారు. రామ్ చరణ్‌తో రాజమౌళి తీసిన మగధీర సినిమాలోని ఒక పాటను ఇక్కడే చిత్రీకరించారని గుర్తు చేసుకున్నారు. వెయ్యి పదాలు చెప్పలేనిది ఓ దృశ్యం చెబుతుందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు చరిత్ర తెలియజేసేలా అత్యాధునిక టెక్నాలజీతో సౌండ్ అండ్ లైట్ సిస్టమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
మన వారసత్వ సంపదను కాపాడుకోవాలని.. గతంలో తాను కేంద్ర పర్యాటక మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీని టూరిజంలో నెంబర్ వన్‌గా నిలబెట్టిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. మన దేశంలో ఉన్న భిన్న వాతావరణ పరిస్థితులు, టూరిజం వసతులు ఎక్కడ ఉండవని తెలిపారు. ఓవైపు ఎడారి, మరోవైపు మంచు, ఇంకోవైపు అత్యధిక వర్షపాతం వంటి విభిన్న స్థితులు ఉన్నాయని.. ఇదీ మన భారత్ గొప్పదనమని కొనియాడారు. అయితే ప్రపంచ టూరిజంలో మనది కేవలం 1.3 శాతమే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఖ్య మరింత పెరగాలని, వరల్డ్ టూరిజంలో భారత్ మెరుగైన స్థానంలో ఉండాలని తాను ఆశిస్తున్నానని అన్నారు. మన జీడీపీలో సింహభాగం టూరిజం నుంచే ఉందని చిరు వెల్లడించారు.
ఇక కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ హయాంలో వారసత్వ సంపదకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే చారిత్రాత్మక గోల్కొండ కోటలో సరికొత్త టెక్నాలజీతో సౌండ్ అండ్ లైట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. అలాగే రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు వచ్చిందన్నారు. వరంగల్ వేయి స్థంబాల గుడిని పునర్ నిర్మిస్తున్నామన్నారు. అక్కక కూడా ఇలాంటి సౌండ్ అండ్ లైట్ షో కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భద్రాచలం, జోగులాంబ అమ్మవారి దేవాలయాల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించిందన్నారు. గిరిజన యూనివర్సిటీకి సమ్మక్క సారక్క అని పేరు పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు.
కాగా పాత లైటింగ్ స్థానంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఙానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకుల్ని ఆకర్షించేలా హై ఎండ్ టెక్నాలజీతో మ్యూజికల్ లైటింగ్ షోను అప్‌గ్రేడ్ చేశారు. రాత్రి వేళ మరింత ఆకర్షణీయంగా కోట కనిపించేలా లైట్ షో తీర్చిదిద్దారు. 30 ఏళ్ల క్రితమే గోల్కొండ కోటలో సౌండ్ అండ్ లైట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో మరిన్ని హంగులు సమకూర్చారు. వీకెండ్లో సౌండ్ అండ్ లైట్ షోలో తెలుగు, హిందీ , ఇంగ్లీష్ భాషల్లో గోల్కొండ చరిత్రను కళ్లకు కడుతారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments