‘విశాఖలో రాజధాని ఎందుకు..? ఎవరు అడిగారు!?’
- IndiaGlitz, [Thursday,December 26 2019]
‘రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో అడుగుతున్నాను. ప్రభుత్వం ఎందుకు విశాఖ వైపు మొగ్గుచూపింది..? విశాఖలో అభివృద్ది జరిగిందని సీఎం జగన్ కూడా అంగీకరించాడు. అలాంటప్పుడు విశాఖలో కొత్తగా రాజధాని ఏర్పాటుచేసి ఏం సాధిస్తారు?. ఏమీ అడగని వాళ్లకు రాజధాని ఎందుకిస్తున్నారు..?’ అని ప్రభుత్వంపై సీనియర్ రాజకీయవేత్త ఎంవీ మైసూరారెడ్డి విమర్శించారు. ఇప్పటికే బుధవారం మీడియాతో మాట్లాడి.. రాయలసీమలోనే రాజధాని ఉండాలని లేకుంటే ఉద్యమాలు వస్తాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చిన ఆయన.. రాజధానిని ముక్కలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటే రాయలసీమకు రావాల్సిన వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. హైకోర్టును రాయలసీమకు ఇవ్వడం న్యాయమైన వాటా అనిపించుకోదని, హైకోర్టుతో ఎంతమందికి అవసరం ఉంటుందని అన్నారు.
మైసూరా ఇంతకు ముందు ఏమన్నారు!?
సీమ వాసులు మాత్రం హైకోర్టు ఒక్కటే ఇస్తే ఏం ఫలితమని.. అమరావతి వాసులు మాత్రం రాజధాని తరలించే ప్రసక్తే లేదని రైతులు చెబుతున్నారు. ఈ క్రమంలో సరికొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రాయలసీమకు హైకోర్టుకు ఇస్తే ఏం ఫలితం..? రాజధానే కావాలంటూ సీమకు చెందిన కొందరు నేతలు సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. బుధవారం నాడు సీమ కీలక నేతలు మైసూరా రెడ్డి, శైలాజానాథ్, గంగుల ప్రతాప్‌రెడ్డి, దినేష్ రెడ్డితో పాటు పలువురు సీఎంకు లేఖలు రాసి.. గ్రేటర్ రాయలసీమను రాజధాని చేయాలని కోరారు.