నా గుండె ముక్కలైంది.. వాడు ఇలా చేస్తాడనుకోలేదు, క్షమించండి: ‘‘కళావతి’’ పాట లీక్‌పై తమన్ ఆవేదన
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. మేకర్స్ ఎంత కట్టుదిట్టంగా వుంటున్నా సినీ పరిశ్రమను పైరసీ , లీకుల బెడద వీడటం లేదు. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా, పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘‘సర్కారు వారి పాట’’ సినిమాకు సంబంధించిన ‘‘కళావతి’’ సాంగ్ నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఈ పాటని ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంది. ‘కళావతి’ అంటూ సాగే ఈ పాట ప్రోమోని సైతం రెండు రోజుల క్రితం విడుదల చేసింది. కానీ శనివారం సాయంత్రం ‘కళావతి’ ఫుల్సాంగ్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై సర్కారు వారి పాట నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సైబర్ క్రైమ్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎమోషనల్ అయ్యారు. తన హృదయం ముక్కలైందంటూ ఓ ఆడియోని ట్విటర్లో షేర్ చేశారు. ‘మనసంతా బాధగా ఉందని.. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదన్నారు. దాదాపు ఆర్నెళ్లుగా ఈ పాట కోసం ఎంతో కష్టపడ్డామని... ఈ పాట చిత్రీకరణ జరిగే సమయంలో ఎనిమిది మందికి కరోనా వచ్చిందని తమన్ తెలిపారు. అయినా సరే, తామంతా కలిసి మంచి సాంగ్‌ని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో కష్టపడి పనిచేశామని ఆయన పేర్కొన్నారు. త్వరలో మీ అందరికీ ఈ పాట వినిపించాలనుకున్నామని.. కానీ, ఒకడు అంత ఈజీగా దీన్ని లీక్ చేసేసి.. ఆన్లైన్లో పెట్టేశాడని తమన్ ఆవేదన వ్యక్తం చేశారు.
వాడికి పని ఇస్తే ఈ పని చేస్తాడనుకోలేదని కోపం, బాధ ఉప్పొంగుకొస్తున్నాయని తమన్ చెప్పారు. దీన్ని ఇలాగే వదిలేసి ఎలా ముందుకు సాగిపోవాలో అర్థం కావడం లేదన్నారు. తాను ఎంతో ధైర్యంగా ఉంటానని.. జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నానని. కానీ ఇప్పుడు ఈరోజు ఎంతో బాధగా వుందని తమన్ ఆవేదన వ్యక్తం చేశారు. పైరసీ చేసినవాడికి మా బాధ అర్థం కావాలని... పైరసీ ఎంత ఘోరమైన విషయమో తెలుసుకోవాలనే ఈ ఆడియో పెట్టానని ఆయన చెప్పారు. సుమారు 1000 మంది కష్టానికి దక్కిన ప్రతిఫలం ఈ పాట అని.. అభిమానులంతా తనను క్షమించాలని తమన్ ఉద్వేగానికి గురయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com