బీజేపీలోకి ఈటల.. ముహూర్తం ఫిక్స్!
- IndiaGlitz, [Friday,May 28 2021]
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి రంగం కూడా సిద్ధమైనట్టు సమాచారం. దీనికి ముహూర్తం కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. ఈనెల 30వ తేదీన బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని తొలుత ఈటల భావించారు కానీ అదే రోజు.. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో పార్టీ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని వాయిదా వేసుకున్నారు. బీజేపీలో ఈటల చేరిక జూన్ 1, 2 తేదీల్లో ఉండొచ్చని తెలుస్తోంది. ఈటలతో పాటు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి సైతం బీజేపీలో చేరనున్నారు. కాగా.. బీజేపీలో చేరడానికి ముందే ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారని సమాచారం.
ఇదీ చదవండి: నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి.. రూ.2 లక్షల జరిమానా..
బీజేపీలోకి ఈటల వెళ్లనున్నారన్న సమాచారం అందుకున్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిలు రాజేందర్ ఇంటికి వెళ్లి.. ఆయనకు నచ్చజెప్పే యత్నం చేశారు. ఇప్పుడు పార్టీ మారితే కేసులకు భయపడే వెళ్లారని ప్రజలు అనుకుంటారని తెలిపారు. అదే జరిగితే ఆయనకు ఎలాంటి ప్రయోజనముండదని ఈటలకు వివరించారు. దీనిపై మనమందరం కలిసి నడుద్దామని ఈటలకు కొండా విశ్వేశ్వరరెడ్డి, కోదండరాం సూచించినట్టు తెలుస్తోంది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా గట్టిగా నిలబడితే మీ వెనుక మేముంటామని చెప్పినట్టు సమాచారం. ప్రజల్లో ఈటలపై సానుభూతి ఉందని.. ఆ బలం నిలబడాలన్నా పెరగాలన్నా.. తనకు జరిగిన అన్యాయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్టు తెలుస్తోంది.
కొండా విశ్వేశ్వరరెడ్డి, కోదండరాం చెప్పిన విషయాలేవీ పట్టనట్టే ఈటల వ్యవహరించారు. వీరితో సమావేశానంతరం మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఇంటికి ఈట వెళ్లారు. అక్కడ బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మరికొందరు నేతలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కోదండరాం, కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పిన విషయాలను ఈటల ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మొత్తానికి బీజేపీలో చేరాలనే నిర్ణయం తీసుకుని ఈటల పెద్ద తప్పే చేస్తున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు, తనపై కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాకుండా చూసుకునేందుకే ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారని చర్చ జరుగుతోంది.