ఓ వ్యక్తిపై, విషయంపై.. మనం ఎక్కువ ఇష్టాన్ని ఏర్పరుచుకుని మనం ఊహించినట్లు జరగకపోతే చాలా బాధ పడతాం. అలాంటి ఓ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన సినిమాయే ‘మర్డర్’. మిర్యాలగూడ పరువు హత్య కావచ్చు.. లేదా మరేదైనా కుటుంబంలో జరిగిన ఘటన కావచ్చు. ఓ కుటుంబం లేదా ఆ కుటుంబంలోని పెద్ద.. సదరు కుటుంబంలోని వ్యక్తి మీద పెంచుకున్న అపరిమితమైన ప్రేమ. తీసుకునే క్షణిక ఆవేశ నిర్ణయాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనే అంశాలను ఆధారంగా చేసుకుని ఆర్జీవీ ఐడియాలజీతో దర్శకుడు ఆనంద్ చంద్ర రూపొందించిన చిత్రం ‘మర్డర్’. ఈ సినిమా తమ కథే అంటూ మిర్యాలగూడ పరువు హత్యలో భర్త ప్రణయ్‌ను పోగొట్టుకున్న అమృత, ఆమె కుటుంబం కేసు వేసింది. సినిమా విడుదలను ఆపమని కోరింది. కేసును పరిశీలించిన కోర్టు, రివైజ్డ్ కమిటీ ‘మర్డర్’ సినిమా విడుదలకు అనుమతిని ఇచ్చింది. అసలు ఈ సినిమా ద్వారా ఆర్జీవీ అండ్ టీం ఏం చెప్పాలనుకున్నారు? అనే విషయం తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం..
కథ:
సమాజంలో పేరు ప్రతిష్టలు, హోదా ఉన్న వ్యక్తి మాధవరావు(శ్రీకాంత్ అయ్యంగర్). ఆయన అనుకూలవతి అయన భార్య వనజ(గాయత్రి భార్గవి) .. వీరికి కుమార్తె నమ్రత(సాహితి). సంతోషమైన కుటుంబం. ముఖ్యంగా మాధవరావుకి కూతురంటే ప్రాణం. తన కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు. ఆమె అడిగినది చేయడానికి ఏమాత్రం ఆలోచించడు. ఓరోజు తను ప్రవీణ్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెబుతుంది. ప్రవీణ్ గురించి తన తమ్ముడు(గిరిధర్) సాయంతో వివరాలు తెలుసుకుంటాడు. ప్రవీణ్ కుటుంబం డబ్బు కోసం నమ్రతను ట్రాప్ చేశారని తమ్ముడు చెప్పడంతో మాధవరావు.. నమ్రత, ప్రవీణ్ ప్రేమను ఒప్పుకోడు. నమ్రతను హౌస్ అరెస్ట్ చేస్తాడు. అయితే నమత్రం ఇంట్లో నుంచి పారిపోయి ప్రవీణ్‌ను పెళ్లి చేసుకుంటుంది. తండ్రితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. కూతురు తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకుందని, తన పరువు పోయిందని మాధవరావు కుమిలిపోతాడు. పిచ్చివాడిలా తయారవుతాడు. అలాంటి పరిస్థితుల్లో తన కూతురిని తన దగ్గరకు రప్పించుకోవడానికి మాధవరావు ఓ నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం వల్ల కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది? మాధవరావు కుటుంబం ఏమవుతుంది? అనే విషయం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
కూతురిపై విపరీతమైన ప్రేమను పెంచుకున్న తండ్రి వ్యథే ‘మర్డర్’. అందుకనే సినిమాను మాధవరావు కోణంలో చెప్పడం ప్రారంభించాడు దర్శకుడు. అసలు కూతురే ప్రాణం బతికిన తండ్రి కథ ఎలాంటి మలుపు తీసుకుందనే విషయాన్ని క్లియర్ కట్‌గా చూపించాడు. తండ్రి పాత్రలో శ్రీకాంత్ అయ్యంగర్ పాత్రలో ఒదిగిపోయాడు. అలాగే కూతురి పాత్రలో సాహితి కూడా చక్కగా నటించింది. కూతురు పడే బాధను చక్కటి ఎమోషన్స్‌తో చూపించాడు శ్రీకాంత్. నాటకీయత కొన్ని సన్నివేశాల్లో ఎక్కువ అయ్యిందేమో అనిపించినా, ఎమోషన్స్ పరంగా ఓకే అనిపిస్తుంది. గాయత్రి భార్గవి, సాహితీ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ, డి.ఎస్.ఆర్ సంగీతం బావున్నాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే కొన్ని సీన్స్ మరి సీరియల్ సీన్స్‌ను తలపించేలా నెమ్మదిగా సాగాయి. అయితే సినిమాను తండ్రి కోణంలో నడిపించాడే కానీ.. కూతురి కోణం చూపించలేదు. కూతురుకి ప్రేమను అర్థం చేసుకునే పరిణితి లేదు అనేలా సినిమా ఉంటుంది. అలాగే కూతురు పెళ్లి చేసుకునే అబ్బాయిని విలన్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. చివరలో అత్త, మామ నిజ స్వరూపం తెలుసుకుని నమత్ర తల్లిని చేరుకుంటుందని చూపించాడు. అంటే నమ్రత భర్త, ఆమె అత్త మామలను విలన్స్ అని చెప్పకనే చెప్పేశాడు ఆర్జీవీ.
చివరగా... ‘మర్డర్’.. కూతురి పిచ్చి ప్రేమ పెంచుకున్న తండ్రి కథ
Comments