మంచినీళ్లనుకుని శానిటైజర్ తాగిన మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్

  • IndiaGlitz, [Wednesday,February 03 2021]

పొరపాట్లు మానవ సహజం.. కానీ అవి ప్రాణం మీదకు వచ్చేవైతేనే కష్టం. సీరియస్‌గా జరుగుతున్న సమావేశంలో అనుకోని ఘటన జరిగింది. కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించినప్పటికీ శానిటైజర్ వాడకం బాగా పెరిగింది. ఏ సమావేశం జరిగినా పక్కాగా వాటర్ బాటిల్‌తో పాటు శానిటైజర్‌ను కూడా పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ అధికారి మంచినీళ్లనుకుని శానిటైజర్ తాగారు. వెంటనే పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ చేయడంతో దానిని ఉమ్మేశారు. అసలు విషయంలోకి వెళితే బుధవారం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం జరిగింది.

2021-2022 సంవత్సరానికి విద్యాశాఖ బడ్జెట్‌ను బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ రమేష్ పవార్ సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రమేష్ పవార్ నీళ్లకు బదులు శానిటైజర్ తాగి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆయన చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వాటర్ బాటిల్, శానిటైజర్ బాటిల్ కాస్త ఒకేలా ఉండటంతో ఆయన చూసుకోకుండా తాగేస్తున్నారు. వెంటనే సెక్యూరిటీ అలర్ట్ చేయడంతో ఆయన దానిని ఉమ్మేశారు. పక్కనే ఉన్న అధికారి ఆయనను శానిటైజర్ తాగకుండా ఆపడానికి ప్రయత్నించినప్పటికీ, అప్పటికే ఆలస్యం అవడంతో పవార్ సిప్ వేసినట్టు తెలుస్తోంది. వెంటనే పక్కనున్న వారు వాటర్ బాటిల్ అందించారు.