హైదరాబాద్‌లో దారుణం.. ముంబై యువతిపై అత్యాచారయత్నం

  • IndiaGlitz, [Wednesday,October 14 2020]

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో దారుణం చోటు చేసుకుంది. ముంబైకి చెందిన యువతితో బలవంతంగా మద్యం తాగించి ఓ వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. దీంతో బాధితురాలు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బర్త్‌డే పార్టీ పేరిట యువతిని హోటల్‌కు రప్పించి దారుణానికి ఒడిగట్టినట్టు యువతి తెలిపింది. ఈ ఘటన మే నెలలో జరిగింది. ఆ వెంటనే బాధితురాలు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా సదరు వ్యక్తి బాధితురాలికి వాట్సప్‌ ద్వారా న్యూడ్‌ వీడియోలు పంపించి కేసు వాపసు తీసుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు మరోసారి పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ప్రజక్త అనే యువతి క్రిష్ణ చౌదరి అనే వ్యక్తి ద్వారా బాధితురాలికి ముంబైలో పరిచయమైంది. ఈ క్రమంలోనే ప్రజక్త.. అన్షూ కుక్రేజా అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని.. అతని కంట పడకుండా మీ ఇంట్లో ఉంటానంటూ బాధితురాలిని కోరింది. దీంతో ప్రజక్తకు తన ఇంట్లో బాధితురాలు ఆశ్రయం కల్పించింది. కాగా మే10న స్వీటీ అనే యువతి ప్రజక్తకు ఫోన్‌ చేసింది. హైదరాబాద్‌లో జుబేర్‌ అనే మిత్రుడి బర్త్‌డే పార్టీ ఉందని తప్పక రావాలంటూ ఆహ్వానించింది. దీంతో మే11న బాధితురాలితో కలిసి ప్రజక్త.. హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో బస చేసింది. అదే రోజు రాత్రి జుబేర్ బర్త్‌డే పార్టీకి ఇద్దరూ హాజరయ్యారు. పార్టీలో జుబేర్‌, ప్రజక్త, స్వీటీలు కలిసి బాధితురాలికి బలంవంతగా మద్యం తాగించారు. తర్వాత జుబేర్‌ బాధితురాలిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. అయితే ఆమె ప్రతిఘటించడంతో స్వీటీతో కలిసి జుబేర్‌ హోటల్‌ నుంచి వెళ్లిపోయాడు.

కాగా.. మే14న బాధితురాలు ముంబైకి చేరుకుని అక్కడి పోలీసులకు జుబేర్‌పై ఫిర్యాదు చేసింది. అయితే తన బర్త్‌డే సమయంలో బాధితురాలు బట్టలు మార్చుకునేటప్పుడు వీడియోలు తీసిన జుబేర్‌ ఆమెకు వాట్సాప్‌ ద్వారా వాటిని తాజాగా పంపించాడు. కేసు వాపసు తీసుకోవాలని లేకుంటే వీడియోలు యూట్యూబ్‌లో పెడతానంటూ బాధితురాలికి ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై మరోసారి బాధితురాలు ముంబై పోలీసులను ఆశ్రయించింది. జుబేర్‌, ప్రజక్త, స్వీటీలపై ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఘటన హైదరాబాద్‌లో జరగడంతో ముంబై పోలీసులు.. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు కేసును బదిలీ‌ చేశారు. బంజారా హిల్స్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.