జర్నలిస్టుల తొలగింపుపై ముంబై ప్రెస్ క్లబ్ తీవ్ర ఆగ్రహం
- IndiaGlitz, [Thursday,April 16 2020]
కరోనా సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగులను తొలగించొద్దని.. వారి జీతాల్లో కోత తగదని సాక్షాత్తు ప్రధాని మోదీ బహిరంగంగా ప్రకటించారు. అయితే కొన్ని మీడియా సంస్థల యాజమాన్యాలు ప్రధాని మాటలను బేఖాతరు చేస్తూ ఉద్యోగుల తొలగింపు, జీతాల్లో కోత యథేచ్చగా చేపట్టాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంలా.. అన్యాయంపై యుద్ధం చేసే యోధుల్లా బీరాలు పలికే మీడియా సంస్థలు.. సొంత ఉద్యోగులను ఇలా మనోవ్యధకు గురిచేయడం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. మీడియా సంస్థల తీరును ముంబై ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది. దీనిపై సమాచార ప్రసార శాఖ తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత ప్రమాదకరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తూ నివారణ చర్యలు చేపట్టింది. అయితే కొన్ని మీడియా సంస్థలు లాక్డౌన్ సాకుతో ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టాయి. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటుగా నిస్వార్థంగా సేవలు అందిస్తున్న జర్నలిస్టులకు ఆయా మీడియా సంస్థలు షాకిస్తున్నాయి. ఉద్యోగులకు అండగా ఉండాల్సిన సంస్థలు తొలగింపు, కోత అనే రెండు మార్గాల్లో వెళ్లడం సంచలనం సృష్టిస్తోంది. గత నెలలలో మార్చి 20న కేంద్ర కార్మిక శాఖ కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులను తొలగించడం, జీతాల్లో కోత విధించడం తగదని.. పారిశ్రామిక వివాదాల చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంతేగాక ఏప్రిల్ 14నాటి ప్రధాని ప్రసంగంలోనూ ఇదే విషయం చెప్పారు. అయినా మీడియా యాజమాన్యాలు తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తొలగించిన వారిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవడంతో పాటు.. జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.