అమితాబ్ బాడీగార్డ్‌గా విధులు.. కానిస్టేబుల్ ఆస్తులు చూసి షాకైన అధికారులు
- IndiaGlitz, [Thursday,February 17 2022]
ప్రముఖులు, సెలబ్రెటీల పేర్లు చెప్పి.. లేదా వాళ్లతో ఫోటోలు దిగి కేటుగాళ్లు పలువురిని మోసం చేసిన ఉదంతాలు ఎన్నో. అయితే ఈ కేసులో మాత్రం ఏకంగా సెలబ్రెటీ దగ్గర పనిచేసిన మాజీ అంగరక్షకుడు కోట్లు వెనకేశాడు. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ సూపర్‌స్టార్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు జితేంద్ర అనే పోలీస్ కానిస్టేబుల్ గతేడాది ఆగస్టు వరకు అంగరక్షకుడిగా పనిచేశారు. అయితే ఆయన లీలలు తెలయడంతో ఉన్నతాధికారులు అతనిపై వేటు వేశారు.
2015 నుంచి ఆగస్టు 2021 వరకు అమితాబ్‌కు జితేంద్ర అంగరక్షకుడిగా పనిచేశాడు. ఈ సమయంలో ఆయన వార్షిక ఆదాయం రూ.1.5 కోట్లు దాటినట్లు ఆరోపణలు రావడంతో ముంబయి పోలీసు కమిషనర్ హేమంత్ నగ్రాలే.. అమితాబ్‌కి భద్రత కల్పించే విధుల నుంచి జితేంద్రను తప్పించారు. అనంతరం డీబీ మార్ పోలీసుస్టేషన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. అమితాబ్ దగ్గర వున్న సమయంలో ఉన్నతాధికారులకు చెప్పకుండా సింగపూర్, దుబాయ్‌లకు జితేంద్ర కనీసం నాలుగుసార్లు వెళ్లొచ్చారని సమాచారం.
నిబంధనల ప్రకారం.. కానిస్టేబుల్ విదేశాలకు వెళ్లాలంటే ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. వీటిని జితేంద్ర ఉల్లంఘించాడు. అంతేకాదు.. అతను తన భార్య పేరు మీద ఓ సెక్యూరిటీ సంస్థను ఏర్పాటు చేశారని, ఆ సంస్థే బచ్చన్ కుటుంబసభ్యులకు భద్రత కల్పిస్తోందని ముంబై పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. ఇందుకు సంబంధించిన రుసుములన్నీ శిందే ఖాతాలో కనిపిస్తున్నాయని, ఆయన భార్య ఖాతాలో కాదని సదరు అధికారి వెల్లడించాడు. ఈ ఆదాయంతో జితేంద్ర భారీగా ఆస్తులు కొన్నాడని.. కానీ ఆ వివరాలను అతను వివరించలేదని చెప్పాడు.