Mukesh Ambani: కుమారుడు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న ముఖేశ్ అంబానీ
Send us your feedback to audioarticles@vaarta.com
బిజినెస్ టైకూన్, అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రివెడ్డింగ్ గ్రాండ్‌గా జరుగుతున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో న భూతో న భవిష్యతి అన్న రీతిలో ఈ వేడుకలు సాగుతున్నాయి. మూడు రోజుల పాటు సాగనున్న ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులు తరలివచ్చారు. తొలిరోజు ఈవెంట్‌లో అనంత్ ఉద్వేగంతో ప్రసంగించారు.
"‘నన్ను సంతోషంగా ఉంచేందుకు మా అమ్మ ఎంతో చేశారు. రోజుకు 18-19 గంటలు కష్టపడ్డారు. ప్రీవెడ్డింగ్ ఈవెంట్‌ను స్పెషల్‌గా చేసేందుకు గత రెండు నెలలుగా మా కుటుంబమంతా కేవలం 3 గంటలే నిద్రపోయింది. మీ అందరికీ తెలుసు.. నా జీవితం పూర్తిగా పూలపాన్పు కాదు. ఎన్నో ముళ్లు గుచ్చుకున్న బాధనూ అనుభవించా. చిన్నప్పటి నుంచి చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా. కానీ, ఆ బాధను మర్చిపోయేలా నా తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అండగా నిలిచారు. అనుకున్నది సాధించేలా ప్రోత్సహించారు. వారికి నేనెప్పుడూ రుణపడి ఉంటా’’ అని తెలిపారు.
దీంతో కుమారుడి మాటలకు ఓ దశలో ముఖేశ్ అంబానీ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అపర కుబేరుడైన ఓ బిడ్డకు తండ్రే కదా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. లక్ష కోట్లు ఉన్నా ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం ఏదీ లేదు అంటూ మరికొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా అనంత్ అంబానీకి చిన్నప్పటి నుంచి ఆస్తామా సమస్య ఉంది. ఓ దశలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో బాధ నుంచి విముక్తి పొందేందుకు వైద్యులు స్టెరాయిడ్స్ ఇవ్వడంతో ఆయన బాగా బొద్దుగా తయారయ్యారు.
ఇదిలా ఉంటే వేడుకల్లో భాగంగా తొలిరోజు పాప్ సింగర్ రిహన్నాతో పాటు పలువురు ప్రముఖులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ వేడుకలకు రామ్‌చరణ్ దంపతులు, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అనిల్ కపూర్, సోనమ్ కపూర్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, సైఫ్ అలీఖాన్, అజయ్ దేవగణ్, మాధురీ దీక్షిత్, శ్రద్ధా కపూర్, దిశా పటానీ, అనన్య పాండే లాంటి పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే ప్రపంచ కుబేరులు బిల్‌గేట్స్, మెటా సీఈవో జుకర్‌బర్గ్ కూడా హాజరుకావడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments