Mudragada: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం
- IndiaGlitz, [Friday,March 15 2024]
ఎట్టకేలకు కాపు సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. ముద్రగడకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండా కిర్లంపూడి నుంచి తన కుమారుడితో పాటు కొద్ది మంది అనుచరులతో కలిసి నేరుగా తాడేపల్లి చేరుకున్నారు. అనంతరం అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముద్రగడను జగన్ ఆప్యాయంగా హత్తుకుని అభినందనలు తెలిపారు. మొత్తానికి ఇన్నాళ్లూ వైసీపీకి పరోక్షంగా మద్దతు ఇచ్చిన ముద్రగడ..ఇప్పుడు ఆ పార్టీ నేతగా మారిపోయారు.
గత కొద్దిరోజులుగా ముద్రగడ వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే రీజినల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న ఆయన.. పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి ఈనెల 14న తాడేపల్లికి ర్యాలీగా వెళ్లి పార్టీలో చేరాలని భావించారు. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం ఎలాంటి హడావిడి లేకుండా తాడేపల్లి వెళ్లి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ముద్రగడను లేదా ఆయన కుమారుడిని పవన్‌పై పోటీకి దింపాలని భావిస్తున్నారు.
కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ముద్రగడ తొలుత వైసీపీలో చేరాలని భావించారు. కానీ సీఎం జగన్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో నిర్ణయం ఉపసంహరించుకున్నారు. ఇదే సమయంలో జనసేన నేతలు ముద్రగడను కలిశారు. త్వరలోనే పవన్ కల్యాణ్ కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలిపారు. దీంతో ఆయన జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే పవన్ నుంచి పిలుపురాకపోవడంతో అలకబూనారు. ఈ క్రమంలోనే టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయడానికి ఒప్పుకుంది. దీనిపై ముద్రగడ పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. ఆ తర్వాత తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభ వేదికగా తనకు ఎవరూ సలహాలు ఇవ్వొద్దని జనసేనాని స్పష్టంచేశారు. దీంతో ముద్రగడ జనసేనకు దూరం అవుతున్నట్లు మరో లేఖ పవన్‌కు రాశారు.
కాగా కాపు నేత అయిన ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం 1978లో జనతా పార్టీతో మొదలైంది. అనంతరం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాక ఆ పార్టీలో చేరారు. 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 1999 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున కాకినాడ లోక్‌సభ స్థానంలో గెలిచారు. 2009లో పిఠాపురం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2014లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి మరోసారి ఓటమిపాలయ్యారు. తన రాజకీయ జీవితంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగానూ ఆయన పని చేశారు. మొత్తంగా చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ముద్రగడ గెలుపొందారు.